కొట్టేసినా... కొనేవారు లేక! | Two arrested in Nizam's Museum theft case | Sakshi
Sakshi News home page

కొట్టేసినా... కొనేవారు లేక!

Published Wed, Sep 12 2018 2:26 AM | Last Updated on Wed, Sep 12 2018 5:26 AM

 Two arrested in Nizam's Museum theft case - Sakshi

నిజాం టిఫిన్‌ బాక్సును మీడియాకు చూపిస్తున్న కమిషనర్‌ అంజనీ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: క్షణికావేశంతో సౌదీలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు... డిపోర్టేషన్‌పై రావడంతో మళ్లీ వెళ్లే అవకాశం పోయింది. కుటుంబసమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో నిజాం మ్యూజియంపై కన్నుపడింది... నేరచరితు డైన స్నేహితుడితో కలసి చోరీ చేశాడు.. రూ.300 కోట్ల విలువైన పురాతన వస్తువులు కొట్టేసినా ఎవరికి? ఎక్కడ అమ్మాలో తెలియలేదు. దీంతో భూమిలో పాతిపెట్టి ‘బేరాల కోసం’ముంబై వెళ్లారు.

ఈ తతంగం ఇలా సాగుతుండగానే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కారు. పాతబస్తీలోని పురానీహవేలీలో ఉన్న హిజ్‌ ఎగ్జాల్డెడ్‌ హైనెస్‌(హెచ్‌ఈహెచ్‌) నిజాం మ్యూజియంలో చోరీకి పాల్పడిన దొంగల వ్యవహారమిది. ఈ నెల 4న జరిగిన ఈ చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ మంగళవారం తెలిపారు.   

ఆస్పత్రి రద్దీగా ఉండటంతో..
రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్‌ మొబిన్‌ 2015లో  సౌదీ వెళ్లి వెల్డర్‌గా పని చేసేవాడు. అక్కడ రెండున్నర నెలల క్రితం ఓ పాకిస్తానీపై చేయి చేసుకున్నాడు. దీంతో అరెస్టయి, శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత అధికారులు బలవంతంగా భారత్‌కు తిప్పి (డిపోర్టేషన్‌) పంపారు. మళ్లీ సౌదీ వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించాడు. 

అనారోగ్య కారణాలతో జూలై చివరి వారంలో మస్రత్‌ మహల్‌ సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో టోకెన్‌ తీసుకున్న మొబిన్‌ కాలక్షేపానికి దగ్గరలో ఉన్న నిజాం మ్యూజియానికి వెళ్లాడు. అరకొర భద్రత ఉండటంతో పాటు అందు లో ఉన్న బంగారం టిఫిన్‌ బాక్స్, కప్పు, సాసర్, టీ స్పూన్లు, బంగారం పొదిగిన ఖురాన్‌ అత డిని ఆకర్షించాయి. సౌదీ జైల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ నేరగాళ్లతో పరిచయమైంది. దీంతో ఈ వస్తువుల్ని ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు.  

35 రోజుల ముందే మార్కింగ్‌...
రాజేంద్రనగర్‌కే చెందిన సెంట్రింగ్‌ వర్కర్‌ మహ్మద్‌ గౌస్‌ పాషాకు నేరచరిత్ర ఉంది. ఇప్పటివరకు 25 నేరాలు చేశాడు. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు కావడంతో మొబిన్‌ తన ఆలోచనను ఇతడికి చెప్పాడు. దీంతో చోరీ చేద్దామని నిర్ణయించుకున్న ఇద్దరూ ఆగస్టు మొదటి వారంలో మ్యూజి యంను సందర్శించారు. ఆద్యంతం రెక్కీ చేశా రు. మరో రోజు వచ్చి ఏ వెంటిలేటర్‌ నుంచి లోపలికి దిగాలో నిర్ణయించుకుని మూడు చోట్ల ‘యారో’, ‘స్టార్‌’మార్కింగ్‌ చేశారు.

మ్యూజియంలో సీసీ కెమెరాలు ఉండటం, వీటిలో రికార్డయిన ఫుటేజ్‌ 30 రోజుల పాటు స్టోరేజ్‌ ఉంటుందనే విషయం తెలియడంతో.. గౌస్‌ చోరీని నెల తర్వాత చేద్దామంటూ మొబి న్‌కు చెప్పాడు. అలా కాకుంటే చోరీ తర్వాత పోలీసులు సందర్శకుల విజువల్స్‌ పరిశీలిస్తే చిక్కుతామని అంతకాలం ఆగారు. చివరకు ఈ నెల 3న ద్విచక్ర వాహనంపై మ్యూజియం వద్దకు చేరుకున్నారు.  

పట్టుకుంది గౌస్‌... దిగింది మొబిన్‌
గౌస్‌ తన సిమ్‌కార్డును ఇంట్లోనే వదిలి సెల్‌ఫోన్‌ తీసుకువచ్చాడు. వెనుక ఉన్న మసీదు సమీపం నుంచి మ్యూజియం పైకి ప్రవేశించిన ఇద్దరూ ముందే పెట్టుకున్న మార్కింగ్‌లను సెల్‌లో ఉన్న టార్చ్‌ సాయంతో గుర్తించారు. వెంటిలేటర్‌పై ఉన్న గ్లాస్, గ్రిల్స్‌ తొలగించిన తర్వాత తాడు ను గౌస్‌ లోపలకు వదిలాడు. దీని సాయంతో మొబిన్‌ లోపలకు దిగాడు.

అల్మారా పగులకొట్టి టిఫిన్‌ బాక్స్, కప్పు సాసర్, స్పూన్‌ తస్కరించి బ్యాగ్‌లో సర్దుకున్నాడు. మరో గదిలో ఉన్న ‘బంగారు ఖురాన్‌’ దగ్గరకు వెళ్లేసరికి మసీదులో   సైరన్‌ మోగింది. దీంతో మొబిన్‌ వెనక్కు వచ్చాడు. ఇద్దరూ వాహనంపై పరారయ్యారు. ముంబై హైవే ద్వారా ముత్తంగి వరకు వెళ్లి... ఓఆర్‌ ఆర్‌ సర్వీస్‌ రోడ్‌ ద్వారా తిరిగి వచ్చారు. రాజేంద్రనగర్‌ ఫామ్‌హౌస్‌ సమీపంలో వస్తువుల్ని పాతిపెట్టారు.

నిజాం వస్తువులు వాడిన ఇరువురూ...
ముంబై వెళ్లి వచ్చిన తర్వాత ఆ వస్తువుల్ని తవ్వి తీసిన గౌస్, మొబిన్‌ తమ ఇళ్లకు తీసుకువెళ్లి వినియోగించారు. వీరి కోసం గాలిస్తున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి సమాచారం అందింది. దీంతో మంగళవారం ఉదయం దాడి చేసి ఇద్దరినీ పట్టుకోవడంతోపాటు బంగారం టిఫిన్‌ బాక్స్, టీకప్పు, సాసర్, స్పూన్‌ స్వాధీనం చేసుకున్నారు.

చోరీ నేపథ్యంలో టిఫిన్‌ బాక్స్‌పై ఉన్న విలువైన వజ్రాలు, రాళ్లు కొన్ని ఊడిపోవడంతో వాటినీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని మీర్‌చౌక్‌ పోలీసులకు అప్పగించారు. దేశంలోనే మ్యూజియంలో జరిగిన భారీ చోరీ ఇదేనని, ఈ తరహా చోరీ ఇంత త్వరగా కొలిక్కి రావడం, సొత్తు మొత్తం రికవరీ కావడం ఇప్పటివరకు జరుగలేదని పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement