సాక్షి, రామాయంపేట(మెదక్) : అప్పులు తీర్చడానికి సౌదీ వెళ్లిన ఓ యువకుడు నిద్రలోనే మృతిచెందాడు. పదిహేనేళ్ల క్రితం బతుకు దెరువు కోసం వెళ్లిన అన్న సైతం యాదృచ్చికంగా నిద్రలోనే కన్నుమూశాడు. అన్న మృతదేహం ఇంకా స్వదేశానికి రాకపోగా.. ఇప్పుడు తమ్ముడి మృతితో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జానిమియాకు భార్య రఫియాతో పాటు ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఇద్దరు ఉన్నారు. అతడికి 16 గుంటల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం సహకరించక కొన్నాళ్లు కూలీ పనులు చేసిన జానిమియా అప్పులపాలై వాటిని తీర్చే మార్గంలేక గత్యంతరం లేక రేండేళ్ల క్రితం మరిన్ని అప్పులు తీర్చడానికి అప్పులుచేసి సౌదీ వెళ్లాడు.
అక్కడ కూలీ పనులు చేసుకుంటున్న తరుణంలో రాత్రి నిద్రలోనే మృతిచెందాడు. పదిహేనేళ్ల క్రితం జానిమియా సోదరుడు అబ్ధుల్లా సైతం బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లి నిద్రలోనే మృతి చెందాడు. కాగా అతడి మృతదేహం ఇప్పటికీ స్వగ్రామానికి రాలేదు. అబ్దుల్లా మృతి మరువకముందే అతడి సోదరుడు జానిమియా సైతం సౌదీలో నిద్రలోనే మృతిచెందడం కుటుంబ సభ్యులను, గ్రామస్థులను కలిచివేసింది. తమకు దిక్కెవరని మృతుడి కుటుంబ సభ్యులు విలపించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరేతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment