soudi victims
-
నాడు అన్న.. నేడు తమ్ముడు
సాక్షి, రామాయంపేట(మెదక్) : అప్పులు తీర్చడానికి సౌదీ వెళ్లిన ఓ యువకుడు నిద్రలోనే మృతిచెందాడు. పదిహేనేళ్ల క్రితం బతుకు దెరువు కోసం వెళ్లిన అన్న సైతం యాదృచ్చికంగా నిద్రలోనే కన్నుమూశాడు. అన్న మృతదేహం ఇంకా స్వదేశానికి రాకపోగా.. ఇప్పుడు తమ్ముడి మృతితో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జానిమియాకు భార్య రఫియాతో పాటు ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఇద్దరు ఉన్నారు. అతడికి 16 గుంటల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం సహకరించక కొన్నాళ్లు కూలీ పనులు చేసిన జానిమియా అప్పులపాలై వాటిని తీర్చే మార్గంలేక గత్యంతరం లేక రేండేళ్ల క్రితం మరిన్ని అప్పులు తీర్చడానికి అప్పులుచేసి సౌదీ వెళ్లాడు. అక్కడ కూలీ పనులు చేసుకుంటున్న తరుణంలో రాత్రి నిద్రలోనే మృతిచెందాడు. పదిహేనేళ్ల క్రితం జానిమియా సోదరుడు అబ్ధుల్లా సైతం బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లి నిద్రలోనే మృతి చెందాడు. కాగా అతడి మృతదేహం ఇప్పటికీ స్వగ్రామానికి రాలేదు. అబ్దుల్లా మృతి మరువకముందే అతడి సోదరుడు జానిమియా సైతం సౌదీలో నిద్రలోనే మృతిచెందడం కుటుంబ సభ్యులను, గ్రామస్థులను కలిచివేసింది. తమకు దిక్కెవరని మృతుడి కుటుంబ సభ్యులు విలపించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరేతున్నారు. -
కేటీఆర్ చొరవతో సౌదీ నుంచి రాష్ట్రానికి..
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన 39 మంది తెలంగాణ వాసులు.. టీఆర్ఎస్ కార్వనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో సోమవారం రాష్ట్రానికి చేరుకున్నారు. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు సౌదీ అరేబియాలోని ఓ నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు. 2018 ఏప్రిల్ తర్వాత సదరు కంపెనీ పూర్తి స్థాయిలో మూతపడింది. దీంతో అక్కడే చిక్కుకున్న కార్మికులు ఆహారం, వసతి వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్మికులు తమ కష్టాలను ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కేటీఆర్.. వారికి సహాయం అందించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. అలాగే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్పందిం చి.. కార్మికుల సమాచారం ఆధారంగా వారిని గుర్తించి తెలంగాణకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. కార్మికుల వద్ద ఉన్న వర్క్ పర్మిట్ వీసా గడువు పూర్తవడంతో భారత రాయబార కార్యాలయం వారికి తాత్కాలిక ఎగ్జిట్ వీసాలను మంజూరు చేసింది. దీంతోపాటు తిరుగు ప్రయాణానికి వీలుగా విమాన టికెట్లు సమకూర్చింది. కేటీఆర్ హర్షం.. కార్మికులు సౌదీ నుంచి స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయంతోపాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబు కార్మికులను సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేశారు. చాలా ఇబ్బందులు పడ్డాం.. కంపెనీ మూతపడటంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఏడాదిగా జీతాలు కూడా లేవు. మా పత్రాలు రెన్యువల్ కాకపోవడంతో బయట కూడా తిరగలేని పరిస్థితి ఎదురైంది. విదేశాంగ అధికారులు చొరవ తీసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, ఎన్నారై సెల్ వారందరూ సహకరించడంతో స్వదేశానికి వచ్చాం. – రవి, నిర్మల్ జిల్లా -
గల్ఫ్‌లో మృత్యుఘోష!
జగిత్యాల రూరల్: ఉన్న ఊరులో ఉపాధి దొరకక.. ఎడారి దేశానికి వెళ్లిన వలస జీవుల బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. కొంత మంది ప్రమాదవశాత్తు మృతి చెందుతుండగా మరికొంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. తమవారి ఆచూకీ లభ్యం కాక వేలాది మంది కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ నుంచి దుబాయ్, మస్కట్, బెహరాన్, దోహఖతర్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, అఫ్గానిస్తాన్, మలేసియా, సింగపూర్ వంటి దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి చెందిన సుమారు 1,523 మంది మృత్యువాత పడటం చూస్తుంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. 1,450 మంది గల్లంతు రాష్ట్రం ఏర్పడిన నుంచి గల్ఫ్ దేశాల్లో సుమారు 1,450 మంది వరకు గల్లంతయ్యారు. ఇంత వరకు తమతో సత్సంబంధాలు లేకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. వీరి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అక్కడున్న వారితో పాటు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఆచూకీ లభ్యం కావడం లేదు. కాగా, అనారోగ్యంతో పాటు రోడ్డు ప్రమాదాల్లో, ఇతర కారణాలతో మరణించిన సుమారు 453 మంది సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు వీలు లేకుండా పోయింది. భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపినా సరైన ఆధారాలు లేవని అక్కడి ప్రభుత్వం తిరస్కరించడంతో అనాథ శవాలుగా మిగిలిపోయాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం కరువు మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం అందక ఆ కుటుంబాలు ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నాయి. 2009లో అప్పటి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేవారు. ప్రస్తుతం ఆ సహాయం కూడా అందకపోవడంతో చాలా కుటుంబాలు ఆర్థిక సహాయం అందక అల్లాడిపోతున్నాయి. దీంతో పాటు గల్ఫ్‌లో మృతిచెందిన వారికి లీగల్ ఎయిర్ సర్టిఫికెట్లు కూడా రెవెన్యూ అధికారులు ఇవ్వకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జైళ్లలో మగ్గుతున్న తెలంగాణవాసులు ఐదేళ్లలో సుమారు 5,435 మంది అక్కడి చట్టాలు తెలియక చేసిన నేరాలకు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ సామాజిక సర్వే అంచనా వేసింది. వీళ్లలో కొంత మంది తెలిసీ తెలియక, మరికొంత మంది క్షణికావేశంలో తప్పులు చేసినవారున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడితే గానీ వీరు స్వరాష్ట్రం రావడం కష్టంగా మారింది. కొంత మందికి అక్కడ న్యాయశాఖ సలహాలు దొరకక చిన్నపాటి నేరాలకు కూడా ఏళ్ల పాటు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. ఇక్కడి కుటుంబీకులు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తే గానీ వారి ఇంటికి చేరుకోవడం కష్టతరంగా ఉంది. నా భర్తను విడిపించండి రాయికల్ (జగిత్యాల): ‘నా భర్త సౌదీ జైల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతన్ని విడిపించాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’.. అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మర్‌పల్లికి చెందిన రాజేశ్వరి వేడుకుంటోంది. గ్రామానికి చెందిన ఓర్సు వెంకటి ఉపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో సరైన జీతం ఇవ్వకపోవడంతో కల్లివెల్లి అయ్యాడు. ఏడు నెలల నుంచి వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్వగ్రామానికి రావాలంటే జైలుశిక్ష అనుభవించాల్సిందే. వెంకట్ అక్కడ పోలీసులను ఆశ్రయించగా ఆయనకు మూడు నెలల శిక్షను విధించారు. నెల రోజుల నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తాను జైల్లో తీవ్రంగా నరకయాతన అనుభవిస్తున్నానని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు వివరించారు. తన భర్తను సౌదీ జైలు నుంచి విడిపించాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను రాజేశ్వరి వేడుకుంటోంది. 25 ఏళ్లుగా ఆచూకీ లేదు నా భర్త ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లి 2,3 సార్లు స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. 25 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. కానీ ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. దుబాయ్‌లో ఉన్న మా గ్రామస్తులు కూడా ఆచూకీ కన్పించడం లేదని చెబుతున్నారు. పాతికేళ్లుగా అతని కోసం ఎదురుచూస్తున్నాం. – రాగుల ప్రమీల, పొరండ్ల, జగిత్యాల మండలం పదేళ్లుగా ఎదురుచూపులు నా భర్త 20 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో నా భర్త మృతి చెందాడని కంపెనీ వారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు మృతదేహాన్ని గుర్తుపట్టలేదు. స్వగ్రామానికి పంపించలేదు. – నాదర్బేగం, మోర్తాడ్ ఆర్థిక సహాయం కరువు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మృతి చెందిన వారికి భారత ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటి ఆర్థిక సహాయం అందించకపోవడంతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో కూడా చాలా కంపెనీలు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లేదు. భారత ప్రభుత్వం గల్ఫ్ మృతులకు ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తే గానీ వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందడం కష్టతరంగా మారింది. – షేక్ చాంద్ పాషా, గల్ఫ్ సామాజిక సేవకుడు, జగిత్యాల -
ముగ్గురు సౌదీ బాధితులకు విముక్తి
ఇద్దరిపై కేసు నమోదు కదిరి : సౌదీలో ఇబ్బందులు పడుతున్న తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన ఖాదర్‌బాషా, షాహిన్, సుమియాకు కదిరి పోలీసులు విముక్తి కల్పించారు. వీరిని సౌదీకి పంపి మోసగించిన కదిరి పట్టణానికి చెందిన బ్రోకర్లు అయూబ్, హిదయతుల్లాపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళ వారం కదిరిలో డీఎస్పీ ఎ¯ŒSవీ రామాంజనేయులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కదిరి ప్రాంతానికి చెం దిన పలువురు బ్రోకర్ల మాయమాటలు నమ్మి సౌదీకి వెళ్లారని, బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకుని ఓ బృందాన్ని సౌదీకి పంపి వారికి విముక్తి కల్పించామన్నారు. నకిలీ ఏజెంట్ల మాయలో పడి సౌదీకి వెళితే అక్కడ బాధలు తప్పవన్నారు. అనంతరం బాధితులు సైతం ఇదే విషయాన్ని మీడియాకు వివరించారు. సౌదీ వెళ్లిన పోలీస్ బృందంలో సీఐలు లక్ష్మణ్, శ్రీనివాసులు, ఎస్ఐలు శ్రీనివాసులు, జయపాల్‌రెడ్డి ఉన్నారని డీఎస్పీ తెలిపారు.