గల్ఫ్‌లో మృత్యుఘోష! | 1523 people dead in last five years at Gulf countries | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో మృత్యుఘోష!

Published Tue, Dec 25 2018 3:06 AM | Last Updated on Thu, Sep 19 2019 9:11 PM

1523 people dead in last five years at Gulf countries - Sakshi

గల్ఫ్‌ నుంచి వచ్చిన తమవారి శవపేటిక వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు (ఫైల్‌)

జగిత్యాల రూరల్‌: ఉన్న ఊరులో ఉపాధి దొరకక.. ఎడారి దేశానికి వెళ్లిన వలస జీవుల బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. కొంత మంది ప్రమాదవశాత్తు మృతి చెందుతుండగా మరికొంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. తమవారి ఆచూకీ లభ్యం కాక వేలాది మంది కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ నుంచి దుబాయ్, మస్కట్, బెహరాన్, దోహఖతర్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, అఫ్గానిస్తాన్, మలేసియా, సింగపూర్‌ వంటి దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి చెందిన సుమారు 1,523 మంది మృత్యువాత పడటం చూస్తుంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.  

1,450 మంది గల్లంతు  
రాష్ట్రం ఏర్పడిన నుంచి గల్ఫ్‌ దేశాల్లో సుమారు 1,450 మంది వరకు గల్లంతయ్యారు. ఇంత వరకు తమతో సత్సంబంధాలు లేకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. వీరి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అక్కడున్న వారితో పాటు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఆచూకీ లభ్యం కావడం లేదు. కాగా, అనారోగ్యంతో పాటు రోడ్డు ప్రమాదాల్లో, ఇతర కారణాలతో మరణించిన సుమారు 453 మంది సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు వీలు లేకుండా పోయింది. భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపినా సరైన ఆధారాలు లేవని అక్కడి ప్రభుత్వం తిరస్కరించడంతో అనాథ శవాలుగా మిగిలిపోయాయి.
 
మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం కరువు 

మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం అందక ఆ కుటుంబాలు ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నాయి. 2009లో అప్పటి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేవారు. ప్రస్తుతం ఆ సహాయం కూడా అందకపోవడంతో చాలా కుటుంబాలు ఆర్థిక సహాయం అందక అల్లాడిపోతున్నాయి. దీంతో పాటు గల్ఫ్‌లో మృతిచెందిన వారికి లీగల్‌ ఎయిర్‌ సర్టిఫికెట్లు కూడా రెవెన్యూ అధికారులు ఇవ్వకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  

జైళ్లలో మగ్గుతున్న తెలంగాణవాసులు 
ఐదేళ్లలో సుమారు 5,435 మంది అక్కడి చట్టాలు తెలియక చేసిన నేరాలకు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ సామాజిక సర్వే అంచనా వేసింది. వీళ్లలో కొంత మంది తెలిసీ తెలియక, మరికొంత మంది క్షణికావేశంలో తప్పులు చేసినవారున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడితే గానీ వీరు స్వరాష్ట్రం రావడం కష్టంగా మారింది. కొంత మందికి అక్కడ న్యాయశాఖ సలహాలు దొరకక చిన్నపాటి నేరాలకు కూడా ఏళ్ల పాటు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. ఇక్కడి కుటుంబీకులు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తే గానీ వారి ఇంటికి చేరుకోవడం కష్టతరంగా ఉంది.

నా భర్తను విడిపించండి 
రాయికల్‌ (జగిత్యాల): ‘నా భర్త సౌదీ జైల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతన్ని విడిపించాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’.. అంటూ జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కుమ్మర్‌పల్లికి చెందిన రాజేశ్వరి వేడుకుంటోంది. గ్రామానికి చెందిన ఓర్సు వెంకటి ఉపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో సరైన జీతం ఇవ్వకపోవడంతో కల్లివెల్లి అయ్యాడు. ఏడు నెలల నుంచి వెంకట్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్వగ్రామానికి రావాలంటే జైలుశిక్ష అనుభవించాల్సిందే. వెంకట్‌ అక్కడ పోలీసులను ఆశ్రయించగా ఆయనకు మూడు నెలల శిక్షను విధించారు. నెల రోజుల నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తాను జైల్లో తీవ్రంగా నరకయాతన అనుభవిస్తున్నానని ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు వివరించారు. తన భర్తను సౌదీ జైలు నుంచి విడిపించాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితను రాజేశ్వరి వేడుకుంటోంది. 

25 ఏళ్లుగా ఆచూకీ లేదు 
 నా భర్త ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లి 2,3 సార్లు స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. 25 ఏళ్ల క్రితం దుబాయ్‌ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. కానీ ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. దుబాయ్‌లో ఉన్న మా గ్రామస్తులు కూడా ఆచూకీ కన్పించడం లేదని చెబుతున్నారు. పాతికేళ్లుగా అతని కోసం ఎదురుచూస్తున్నాం. 
– రాగుల ప్రమీల, పొరండ్ల, జగిత్యాల మండలం

పదేళ్లుగా ఎదురుచూపులు 
నా భర్త 20 ఏళ్ల క్రితం కువైట్‌ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో నా భర్త మృతి చెందాడని కంపెనీ వారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు మృతదేహాన్ని గుర్తుపట్టలేదు. స్వగ్రామానికి పంపించలేదు.  
– నాదర్‌బేగం, మోర్తాడ్‌ 

ఆర్థిక సహాయం కరువు 
ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి మృతి చెందిన వారికి భారత ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటి ఆర్థిక సహాయం అందించకపోవడంతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో కూడా చాలా కంపెనీలు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లేదు. భారత ప్రభుత్వం గల్ఫ్‌ మృతులకు ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తే గానీ వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందడం కష్టతరంగా మారింది.   
 – షేక్‌ చాంద్‌ పాషా, గల్ఫ్‌ సామాజిక సేవకుడు, జగిత్యాల  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement