ప్రమాదంలో మృతి చెందిన అశ్విని, పవిత్ర
సాక్షి, ఎమ్మిగనూరురూరల్/పెద్దకడుబూరు: కొన్ని నిమిషాల్లో క్షేమంగా ఎమ్మిగనూరుకు చేరుకుంటాం అనుకుంటుండగానే మలుపు రూపంలో మృత్యువు ఆ చిన్నారులను పొట్టన పెట్టుకుంది. ఎమ్మిగనూరు సమీపంలో గురువారం మధ్నాహ్నం జరిగిన ఆటో ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామానికి చెందిన మాల నరసింహులు, ఈరమ్మలకు అశ్విని(10), నందిని, ఉష, పవిత్ర(1) నలుగురు ఆడపిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈరమ్మ తన పుట్టినిల్లు కర్ణాటకలోని సిరుగుప్పకు 12 రోజుల కిత్రం వెళ్లారు. గురువారం తన మెట్టినిల్లు కందనాతికి బయలుదేరారు. ఆదోనిలో బస్సు కోసం వేచి ఉండగా టాటా ఏసీ ఆటో ఎమ్మిగనూరుకు వెళ్తుండటంతో అందులో ఎక్కారు.
వేగంగా వస్తున్న ఆటో.. నలందా బీఈడీ కాలేజీ మలుపు వద్ద అదుపు తప్పి డోర్ దగ్గర ఉన్న ఆశ్విని(10) కిందపడబోయింది. పక్కనే ఉన్న తల్లిదండ్రులు కుమార్తెను కిందపడకుండా పట్టుకోవటానికి ప్రయత్నించేలోపు మరో చిన్నారి పవిత్ర(1) కింద పడిపోయింది. క్షణాల్లో ఇద్దరు చిన్నారులు రోడ్డుపై పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ అందులో ఉన్న వారిని కింద దింపి, గాయపడ్డ వారిని అటుగా వస్తున్న ఆటోలో ఎక్కించి, ఆదోని వైపు పరారయ్యాడు. ప్రమాదం హడావుడిలో ఉండటంతో చూసి తప్పించుకువెళ్లినట్లు తెలుస్తుంది. ఆటోలో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే కాకుండా.. పిల్లలకు డబ్బులు ఇవ్వరు అని సీట్లో కూర్చున్న వారిని నిల్చోపెట్టినట్లు బాధితులు చెబుతున్నారు.
ఇదే ప్రమాదంలో తల్లి ఈరమ్మకు ఎడమ చెయ్యి విరిగిపోయింది. క్షణాల్లో కళ్లముందే తమ పిల్లలు దుర్మరణం చెందటంతో తల్లిదండ్రులు దుఃఖసారగంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. పెద్దకడుబూరు ఎస్‌ఐ అశోక్ ప్రభుత్వాసుపత్రికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును చిన్నారుల తండ్రి నరసింహులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని, ఆటో డ్రైవర్‌ను పట్టుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment