ఇద్దరిని మింగిన గంగ | Two Died In A Canal | Sakshi
Sakshi News home page

ఇద్దరిని మింగిన గంగ

Published Tue, Aug 14 2018 11:20 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Two Died In A Canal - Sakshi

సమ్మయ్య మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య 

వేర్వేరు ప్రమాదాల్లో నీళ్లలో పడి ఒకరు గల్లంతు కాగా.. ఇద్దరు మృతి చెందిన సంఘటనలు ఉమ్మడి జిల్లాల్లో సోమవారం చోటు చేసుకున్నాయి. వైరా రిజర్వాయర్‌లో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతుకాగా.. చింతకాని మండలంలోని రామకృష్ణాపురంలో మరొక మత్స్యకారుడు చెరువులో పడి మృత్యువాత పడ్డాడు. టేకులపల్లి మండలంలోని మొక్కంపాడులో పెదవాగు దాటుతూ దాని ఉధృతికి ఓ రైతు బలయ్యాడు.

పెదవాగులో పడి.. 

టేకులపల్లి : ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటుతూ.. ఓ రైతు కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటన సోమవారం మొక్కంపాడులో చోటు చేసుకుంది. బోడు ఎస్సై భూక్య శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో మొక్కంపాడు కు చెందిన ఈసం సమ్మయ్య (50) మేతకు వెళ్లిన పశువులను ఇంటికి తోలుకొచ్చేందుకు అడవి వైపునకు వెళ్లాడు. పశువులు పెద్దవాగు అవతల ఉన్నా యి. అప్పటికే వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

అయినా సమ్మయ్య లెక్క చేయకుండా పశువుల కోసం వాగులో దిగాడు. వాగు ఉధృతి తీవ్రంగా ఉండటంతో కొంత దూరం కొట్టుకుని పోయాడు. గమనించిన స్థానికులు వెళ్లేసరికి.. అప్పటికే ఊపిరాడక సమ్మయ్య మృతి చెందాడు. అతి కష్టం మీద మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకుని వచ్చారు. బోడు ఎస్సై భూక్య శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.  

మత్స్యకారుడు గల్లంతు.. 

వైరా : వైరా రిజర్వాయర్‌లో మత్స్యకారుడు గల్లంతైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. రిజర్వాయర్‌ అలుగుపోస్తున్న నేపథ్యంలో స్థానిక హనుమాన్‌ బజార్‌కు చెందిన వేముల నర్సింహారావు (41) అనే మత్స్యకారుడు చేపలవేటకు వెళ్లాడు. అలుగు వద్ద వల విసురుతుండగా.. ప్రమాదవశాత్తు జారి రిజర్వాయర్‌లో పడి నీటి ఉధృతికి కొట్టుకు వెళ్లాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూ కీ లభించలేదు. నర్సింహారావు కోసం గజ ఈతగాళ్లు సైతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. 

యువకుడికి గాయాలు.. 

మత్స్యకారుడు నర్సింహారావు గల్లంతైన విషయం తెలిసుకొని అదే ప్రాంతానికి చెందిన ఇర్లపూడి హరిష్‌ అలుగు వద్ద నడుచుకుంటూ వెళుతుండ గా.. కాలుజారి అతడి నీటిలో పడ్డాడు. నీటి ఉధృ తికి కొంతదూరం కొట్టుకు వెళ్లాడు. స్నేహితు లు కాపాడి స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికి త్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదంలో హరిష్‌కు స్వల్పగాయాలయ్యాయి.  

వలలు ఏర్పాటు చేస్తుండగా.. 

చింతకాని : మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు బొమ్మకంటి ఆదినారాయణ (52) ప్రమాదవశాత్తు చెరువులో పడి సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు స్థానిక చెరువులోకి భారీగా వరద నీరు చేరి చెరువు అలుగు పడింది.

దీంతో చెరువులోని చేపలు వరదకు పోకుండా ఉండేందుకు అలుగు వద్ద వలలను ఏర్పాటు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆదినారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement