
మరణించిన ప్రశాంత్, మనోజ్
సాక్షి, ధర్మారం(కరీంనగర్) : ధర్మారం మండలంలోని నందిమేడారం బైపాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి లారీ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందినట్లు ధర్మారం ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాకాపూర్ గ్రామానికి చెందిన కుదిరే ప్రశాంత్ (23), తనుగుల మనోజ్ (21)లు బైక్‌పై మేడారం నుంచి పెద్దపల్లికి వెళ్తుండగా లారీ ఢీకొని మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
శాఖాపూర్ గ్రామంలో విషాదం
వెల్గటూరు(ధర్మపురి): మండలానికి చెందిన ఇద్దరు యువకులు శనివారం అర్ధరాత్రి ధర్మారం మండలం మేడారం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో శాఖాపూర్ విషాదం నెలకొంది. యువకుల అంత్యక్రియలు ఆదివారం నిర్వహించగా ఊరంతా నివాళి అర్పించింది. తనుగుల మల్లేశ్,పుష్ప అనే దంపతుల కుమారుడైన మనోజ్ కుదిరె తిరుపతి భూమక్కల కుమారుడైన ప్రశాంత్‌ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. చేతికి అంది వచ్చిన కొడుకులు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తెల్లవారితే మనోజ్ దుబాయ్ విమానం ఎక్కేవాడు
తనుగుల మనోజ్ కుదిరె ప్రశాంత్ ఇద్దరు స్నేహితులు. మనోజ్ దుబాయ్ వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ధర్మారం మండలం వనపర్తిలో మనోజ్ అక్కను కలిసి, ప్రశాంత్ అక్క పెద్దపల్లిలో జరుపుకుంటున్న పోచమ్మ బోనాలకు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. వీరితో గణేశ్ అనే మరో యువకుడు మరోబైక్‌పై బయల్దేరారు. పెద్దపల్లికి చేరకముందే ఇద్దరు స్నేహితులను మేడారం వద్ద లారీ బలితీసుకొంది. ఈ ప్రమాదంతో భయాందోళన చెందిన గణేశ్ గ్రామానికి చేరుకొని సమాచారమిచ్చాడు. కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి తరలి వెళ్లారు. ఇరు కుటుంబాల్లో ఒక కొడుకు ఒక కూతురు కావడం గమనార్హం. నవయువకుల మృతి తల్లిదండ్రులకు తీరని లోటు మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment