సాక్షి, చెన్నై : రాష్ట్రంలో లష్కరే తోయిబా తీవ్రవాదులు చొరబడ్డ సమాచారంతో తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంచీపురం జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని మానామది ఆలయం వద్ద ఆదివారం జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... ఆలయ కొలనులో పూడికతీత పనుల్లో ఈ పేలుడు సంభవించింది. అయితే ఆదివారం కావడంతో ఆ పనులకు విరామం ఇచ్చారు. గ్రామానికి చెందిన సూర్య అనే యువకుడితో పాటు అతడి స్నేహితులు ఆ కొలనుకు వెళ్లారు. అక్కడ ఓ బాక్స్ లభించడంతో దానిని ఆలయం వద్దకు తీసుకొచ్చారు. దానిని తెరిచేందుకు మిత్రులు ఐదుగురు తీవ్రంగానే ప్రయత్నించారు.
ఈ సమయంలో పెద్ద శబ్దంతో ఆ బాక్స్ పేలడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడ‍్డ సూర్యతో పాటు మరో వ‍్యక్తి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ పేలుడు దాటికి ఆలయం వద్ద గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న చెంగల్పట్టు, మహాబలిపురం డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, బాంబ్, డాగ్‌స్కా్వడ్‌లు రంగంలోకి దిగాయి. ఆ బాక్సు ఎక్కడి నుంచి వచ్చింది. దానిని ఆలయం కొలను వద్దకు తీసుకొచ్చి పడేసింది ఎవరు అన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో కాంచీపురం పరిసరాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.
కాగా చొరబడ్డ తీవ్రవాదులు కోయంబత్తూరులో తిష్టవేసి ఉన్నట్టుగా స్పష్టమైన సమాచారం రావడంతో అక్కడ జల్లెడ పట్టి ఉన్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించి పంపుతున్నారు. ఇందులో ముగ్గురి వద్ద మాత్రం కొన్ని గంటల పాటు విచారణ సాగినా, చివరకు వారిని వదలి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివా రం క్రైస్తవులు ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో చర్చిలకు తరలి రావడం ఆనవాయితీ. దీంతో ముష్కరులు ఏదేని కుట్రలు చేసి ఉన్నారా అన్న ఉత్కంఠ, ఆందోళన తప్పలేదు.
రంగంలోకి కమాండో బలగాలు...
శ్రీలంకలో క్రైస్తవ ఆలయాన్ని టార్గెట్ చేసి పేలుళ్లు సాగిన దృష్ట్యా, అక్కడి నుంచి వచ్చిన తీవ్రవాదులు ఇక్కడి ఆలయాల్ని గురి పెట్టారా అన్న ఆందోళన తప్పలేదు. దీంతో కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లోని చర్చిలను వేకువజాము నుంచి పోలీసు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కమాండో బలగాలను సైతం రంగంలోకి దించారు. అణువణువు తనిఖీలు చేశారు. బాంబ్ స్క్వాడ్‌ల తనిఖీలతో పాటు ఆయా ఆలయాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అందర్నీ తనిఖీలు చేసినానంతరం అనుమతించారు. ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల పాటు సాగిన ప్రార్థనలు సాగడంతో అప్పటి వరకు పోలీసులు మరింత అప్రమత్తంగా, డేగ కళ్ల నిఘాతో వ్యవహరించారు.
కోయంబత్తూరు– తిరుప్పూర్ మార్గంలో అయితే, తనిఖీలు మరీ ముమ్మరం చేయడంతో వాహనచోదకులకు తంటాలు తప్పలేదు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన చర్చిలే కాదు, ఇతర ఆలయాల వద్ద సైతం తనిఖీలు సాగాయి. ప్రత్యేక భద్రతను కల్పించారు. తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నా, చొరబడ్డ తీవ్రవాదుల జాడ కానరాని దృష్ట్యా, జల్లెడ పట్టే విషయంలో ఏ మాత్రం పోలీసులు తగ్గడం లేదు. అలాగే, కేరళలో పట్టుబడ్డ అబ్దుల్ వద్ద విచారణ జరిపేందుకు కోయంబత్తూరు నుంచి ప్రత్యేక బృందం బయలుదేరి వెళ్లింది. అతగాడి సాయంతోనే ఆరుగురు తీవ్రవాదులు కోయంబత్తూరులోకి ప్రవేశించి ఉండడం గమనార్హం.
తుపాకీతో యువతి..
రామనాథపురంలోనూ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. తమకు అందిన సమాచారం మేరకు ఉచ్చిపులి గ్రామంలోని వినాయక ఆలయం వీధిలో ఓ ఇంటిపై పోలీసులు గురి పెట్టారు. ఆ ఇంట్లో తనిఖీలు జరపగా ఓ తుపాకీ బయటపడింది. ఆ ఇంట్లో వల్లి అనే మహిళ మాత్రమే ఉంటున్నది. విచారణలో ఆమె టైలరింగ్ చేస్తుండడమే కాకుండా, ఆమె భర్త ఓ కేసులో పుళల్ జైల్లో ఉన్నట్టు తేలింది. దీంతో వల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment