యువకులను ఢీకొట్టిన వాహనం మృతి చెందిన యువకులు (ఫైల్)
తుమకూరు: రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తులను చిక్కమగళూరు బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జిల్లాలోని కుణిగల్ సమీపంలోని ఉర్కేనహళ్లి గ్రామ శివార్లలోని జాతీయ రహదానిపై చోటు చేసుకుంది. కనకపురలోని సూరేన హళ్లి గ్రామానికి చెందిన శశికుమార్ (28), సునీల్‌గౌడ (27)లు స్నేహితులు మునిరాజు, జయచంద్ర, పునీత్, మంజునాథ్‌లతో కలసి కొల్లూరు, శృంగేరి, ధర్మస్థల పర్యటనకు వెళ్లి తిరిగి కార్లలో గ్రామానికి పయనమయ్యారు. మార్గంమధ్యలో ఉర్కేనహళ్లి శివార్లలోని జాతీయ రహదారిపై కాలకృత్యాల తీర్చుకోవడానికి వాహనాలు రోడ్డుపక్కన నిలిపారు.
అదే సమయంలో చిక్కమళూరు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న ఎమ్మెల్యే సీటీ రవి ప్రయాణిస్తున్న కారు వెనుకవైపు నుంచి రోడ్డుపక్కన నిలిపి ఉంచిన కార్లను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కార్లపక్కన ఉన్న వ్యక్తులపై దూసుకెళ్లింది. ఘటనలో శశికుమార్, సునీల్‌గౌడలు అక్కడిక్కడే మృతి చెందగా మునిరాజు, జయచంద్ర, పునీత్, మంజునాథ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో ఎమ్మెల్యే రవితో పాటు కారు డ్రైవర్ ఆకాశ్, గన్‌మెన్ రాజు నాయక్‌లు కూడా గాయపడ్డారు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న కుణిగల్ పోలీసులు శశికుమార్, సునీల్‌ల మృతదేహాలను కుణిగల్ ఆసుపత్రికి తరలించి గాయపడ్డ నలుగురు యువకులను బెంగళూరు ఆసుపత్రిలో చేర్పించారు. ఘటన జరిగిన అనంతరం ఎమ్మెల్యే ఏమైందని కూడా అడగకుండానే మరొక కారులో బెంగళూరుకు వెళ్లిపోయారంటూ గాయపడ్డ యువకులు ఆరోపించారు. విషయం తెలుసుకొని కుణిగల్ ఆసుపత్రికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రవి ఆసుపత్రికి రావాలంటూ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఎమ్మెల్యే రవి ఇక్కడికి వచ్చే వరకు నిరసన విరమించమంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment