రెండు నెలల చిన్నారి
కొడగు(కర్ణాటక): కేరళ వరదల ప్రభావం పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ర్టంపై కూడా పడినట్టుంది. దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కొడగు జిల్లా కూడా వరదలతో అల్లాడుతోంది. నాలుగు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అతలాకుతలమైంది. వరదల్లో చిక్కుకున్న రెండు నెలల పసిపాపను కాపాడేందుకు జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్‌డీఆర్‌ఎఫ్) సభ్యులు తీవ్రంగా శ్రమించారు. తాడుకు వేలాడుతూ చిన్నారిని రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాడు సహాయంతో ఓ జవాను, చిన్నారిని తీసుకొచ్చిన విధం అందరి ప్రశంసలు అందుకుంది.
కొడగు ప్రాంతంలో వచ్చిన వరదలకు ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్‌తో పాటు రాష్ర్ట ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కొడగు జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ నెట్‌వర్క్‌లకు అంతరాయమేర్పడింది. వరదల్లో చిక్కుకున్న వారిని చిన్న చిన్న పడవల ద్వారా రక్షిస్తున్నారు. హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం సామగ్రిని జారవిడుస్తున్నారు.
పెద్ద సంఖ్యలో మైసూరు, రామనగర్, మాండ్య, హాసన్, చామరాజ్‌నగర్‌ల నుంచి డాక్టర్లను కొడగు జిల్లాకు తరలించారు. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారు స్వామి వరద ప్రభావి ప్రాంతాలను హెలికాఫ్టర్ ద్వారా సర్వే చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. వరద ప్రభావిత జిల్లా కొడగుకు వెంటనే రూ.100 కోట్లు మంజూరు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత బీఎస్ యడ్యూరప్ప కూడా కొడగు ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు.
ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతానికి 1000 మంది సిబ్బందిని తరలించింది. అలాగే 200 మంది ఎన్‌సీసీ అభ్యర్థులను కూడా సహాయం చేసేందుకు పంపింది. జోడుపాల్ గ్రామంలో 2500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడటంతో సుమారు 300 ఎకరాల భూమి ఆ గ్రామంలో నాశనమైంది. వరదబాధితులకు 30 రిలీఫ్ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment