హత్యకు ఉపయోగించిన వస్తువులు
రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతికతతో ఆనందించాలో.. తరుగుతున్న మానవ విలువలకు బాధపడాలో తెలియని పరిస్థితి. స్నేహాలు, బంధుత్వాలు, అనురాగాలు, చివరకు మూడుముళ్ల బంధాలు, కన్న ప్రేమలు కూడా దూరమవుతున్నాయి. కేవలం డబ్బు, ఆస్తులకే విలువ నిచ్చేలా ఉన్నాయి.. జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలు. కష్టాల్లో, సుఖాల్లో ఒకరికొకరం తోడుగా ఉంటామని పెళ్లి నాటి మాటలు మృగ్యమవుతున్నాయి. అమ్మను గాయపరిచాడని కన్న కొడుకు తండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అలాగే మామ తమ కుటుంబంలో అశాంతి నెలకొల్పుతున్నాడని, బీమా సొమ్ము వస్తుందని హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం. మరో సంఘటనలో డీకేటీ స్థలం విషయమై హత్య చోటు చేసుకుంది.
తండ్రిని కత్తితో పొడిచిన కుమారుడు
కాశినాయన: బంధాలు మరిచిపోయి ఆస్తి కోసం కన్నతండ్రినే కుమారుడు హత్య చేసిన సంఘటన పలువురిని కలిచివేసింది. ఈ సంఘటన కాశినాయన మండలం వరికుంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. గంగన్నపల్లె గ్రామానికి చెందిన యర్రంరెడ్డి పెంచల్‌రెడ్డి(50)ని కుమారుడు జయసింహారెడ్డి బుధవారం కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. పదేళ్ల కిందట గంగన్నపల్లె నుంచి పెంచల్‌రెడ్డి కుటుంబం వరికుంట్లలో నివాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. పెంచల్‌రెడ్డి భార్య శివమ్మ పేరుతో అయిదెకరాల డీకేటీ పొలం ఉంది. మొత్తంగా 8 ఎకరాల పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయిదేళ్ల కిందట భార్యాభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తన పేరు మీద ఉన్న భూమిని తనకు, కుమారుడికి ఇప్పించాలని కలసపాడు పోలీస్‌స్టేషన్‌లో శివమ్మ ఫిర్యాదు చేసింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసి శివమ్మ, కుమారుడు జయసింహారెడ్డికి రెండు భాగాలు, పెంచల్‌రెడ్డికి ఒక భాగంగా ఇచ్చారు.
శివమ్మ గతేడాది ఏప్రిల్‌లో తన భూమిలో అరటి పంటను సాగు చేసింది. బోరుబావిలో నీరు తగ్గిపోవడంతో ఆమె పంటను వదిలేసి కడప సమీపంలోని పుట్టింటికి వెళ్లింది. పెంచల్‌రెడ్డి భార్య వదిలేసిన పంటకు నీళ్లు, ఎరువులు అందించాడు. ప్రస్తుతం కోత దశకు చేరింది. విషయం తెలుసుకున్న శివమ్మ వారం కిందట పొలం వద్దకు వచ్చి దిగుబడిని తాను అమ్ముకుంటానని భర్తతో గొడవకు దిగింది. ఈ నేపథ్యంలో బుధవారం కూలీలను పిలిపించి అరటి గెలలు కోసేందుకు శివమ్మ పొలం వద్దకు వెళ్లగా.. పెంచల్‌రెడ్డి అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. శివమ్మకు గాయాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తుడైన కుమారుడు జయసింహారెడ్డి తండ్రిని కత్తితో పొడివగా ఘటనాస్థలంలోనే పెంచల్‌రెడ్డి చనిపోయాడు. విషయాన్ని స్థానిక వీఆర్‌ఓ చెంచురామిరెడ్డి పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. కలసపాడు ఎస్‌ఐ వెంకటరమణ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు జయసింహారెడ్డి, శివమ్మ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. విచారణలో పోరుమామిళ్ల సీఐ రెడ్డెప్పరెడ్డి, ఎస్‌ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.
మామను హత్య చేసిన కేసులో..
ఎర్రగుంట్ల : మామ యరమల చెన్నకృష్ణారెడ్డిని హత్య చేసిన కేసులో అల్లుడు రాయపాటి కిరణ్ కుమార్‌రెడ్డి, తన బావ మల్లెం శ్రీనివాసులురెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కడప డీఎస్పీ మాసూం బాషా మాట్లాడుతూ ప్రొద్దుటూరులోని గౌరీ శంకర్ జూనియర్ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న యరమల చెన్నకృష్ణారెడ్డికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద అమ్మాయి చైతన్యవాణిని సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామానికి చెందిన రాయపాటి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సింహాద్రిపురంలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మామ చెన్నకృష్ణారెడ్డి తన కూతురుకు లేనిపోని మాటలు చెబుతూ తన సంసారంలో సుఖం లేకుండా చేస్తున్నాడని, సంసారం ప్రొద్దుటూరులో పెట్టించి తనను చాలా ఇబ్బంది పెడుతున్నాడని అల్లుడు కక్ష పెంచుకున్నాడు. తన మామ చెన్నకృష్ణారెడ్డిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే.. బీమా సొమ్ము నామినీ అయిన తన భార్యకు వస్తుందని ఆలోచించాడు.
దీంతో కిరణ్‌కుమార్‌రెడ్డి తన బావ శ్రీనివాసులురెడ్డితో కలిసి పోట్లదుర్తి ఢాబా సమీపంలోని ప్లాట్లలోకి మామను గత నెల 30న తీసుకెళ్లాడు. ఎర్రగుంట్లలో డబ్బుల కోసమని చెప్పి.. తమ వెంట తెచ్చుకున్న వస్తువులతో మామ చెన్నకృష్ణారెడ్డి కాళ్లు చేతులు కట్టి, తలకు ప్లాస్టిక్ కవర్ తొడిగి సుత్తెతో తలపై కొట్టి చంపారు. హత్యగా అనుమానం రాకుండా ఉండేందుకు ఎర్రగుంట్ల–ప్రొద్దుటూరు రోడ్డులోని శ్రీ ఆంజనేయస్వామి గుడి సమీపంలో గల మైలవరం దక్షిణ కాలువలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. మృతుడు చెన్నకృష్ణారెడ్డి భార్య లక్ష్మీప్రసన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్రగుంట్ల సీఐ వెంకటరమణ కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో తన సొంత అల్లుడు రాయపాటి కిరణ్‌కుమార్‌రెడ్డి, తన బావ శ్రీనివాసులరెడ్డి (పెండ్లిమర్రి మండలం నంది మండలం) కలిసి చెన్నకృష్ణారెడ్డిని హత్య చేసినట్లు తేలింది. నిందితులను బుధవారం జువారి బస్టాప్ వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఐ వెంకటరమణను, పోలీసు బృందాన్ని ప్రత్యేక అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment