విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ రమాకాంత్ ,హత్య కేసులో అరెస్టయిన నిందితులు
సాక్షి, బుక్కపట్నం(అనంతపురం) : బుక్కపట్నం మండలం సిద్దరాంపురం సమీపంలోని పాడుబడ్డ బావిలో గుర్తుతెలియని శవాన్ని గొర్రెలు, పశువుల కాపర్లు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువకుడిని చంపి.. తర్వాత గుర్తుపట్టకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి నిప్పు పెట్టినట్లు నిర్ధారించారు. అయితే మృతదేహం వద్ద ఆనవాళ్లేవీ కనిపించకపోవడంతో గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు, కర్ణాటకలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని అన్నపూర్ణశ్వేరి నగర్ పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయిన వారి వివరాలు సేకరించారు.
జూలై 23న తన సోదరుడు కనబడుటలేదని నరసింహమూర్తి (23) సోదరి రమ్య ఫిర్యాదు చేసింది. రమ్య, మృతుడి కుటుంబ సభ్యులు బుక్కపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంఘటనా స్థలంలో లభించిన వస్తువులను చూసి అవి తమ సోదరుడు నరసింహమూర్తివేనని గుర్తుపట్టారు. హంతుకులకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించకపోయినప్పటికీ పుట్టపర్తి రూరల్ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, బుక్కపట్నం ఎస్‌ఐ విజయ్‌కుమార్, సిబ్బంది ఆధునిక పరిజ్ఞానం సాయంతో నలుగురు నిందితులను గుర్తించారు. వీరిని శనివారం గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద అరెస్ట్ చేశారు.
కారు కోసం ఘాతుకం..
నరసింహమూర్తి వద్ద ఉన్న షిఫ్ట్ డిజైర్ కేఏ41–బీ–7966 కారు కోసమే హత్య చేసినట్లు నిందితులు పొదలి వంశీకృష్ణ, కృష్ణమూర్తి కార్తీక్, పూజారి బలరామ్, ప్రతాప్ తెలిపారు. జూలై 19న రాత్రి 10.30 గంటల సమయంలో బెంగుళూరులోని మెజిస్టిక్ బస్టాండ్ వద్ద బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి పోవాలని బాడుగకు మాట్లాడుకొని కారులో బయల్దేరారు. గ్రామ సమీపంలో పాడుబడ్డ బావి వద్దకు చేరుకున్నాక నలుగురిలో ఇద్దరు టవల్‌తో గొంతుకు బిగించి నరసింహమూర్తిని చంపారు. మొదట మృతదేహాన్ని కారులో చుట్టుపక్కల తిప్పి.. చివరకు చంపిన చోటుకే వచ్చారు. అక్కడ మృతదేహంపై కిరోసిన్ పోసి కాల్చారు. అనంతరం కారులో కర్ణాటకలోని యాదిగిరికి చేరుకుని, అక్కడ ఒక వ్యక్తి దగ్గర రూ.60 వేలకు కారును తాకట్టు పెట్టారు. కారు అమ్మిన తరువాత డబ్బులు చెలిస్తామని అక్కడి నుంచి వెళ్లారు. ఈ క్రమంలోనే గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద పట్టుబడ్డారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment