కృష్ణమోహన్ కుటుంబ సభ్యులు (ఫైల్)
గార్లదిన్నె మండలం రామదాస్‌పేట మలుపులో ఘోరం జరిగింది. దైవదర్శనం ముగించుకుని స్వస్థలానికి కారులో వెళ్తున్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తండ్రీ కుమార్తె అక్కడికక్కడే దుర్మరణం చెందారు. భార్య, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ భర్త, కూతురు మృతదేహాలపై పడి ఆమె రోదించిన తీరు అందరినీ కలచివేసింది.
సాక్షి, గుత్తి/గార్లదిన్నె: గుత్తి పట్టణంలోని కుమ్మర వీధికి చెందిన కరణం కృష్ణమోహన్(51), సౌభాగ్యలక్ష్మి దంపతులు. కృష్ణమోహన్ పెద్దవడుగూరు ఏడీసీసీ బ్యాంకులో సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. వీరి కుమారుడు పవన్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇటీవల హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కుమార్తె ఆశ (23)గత ఏడాది పీజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. కృష్ణమోహన్ భార్య, కుమార్తెతో కలిసి శనివారం అద్దె కారులో ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వెళ్లారు. దైవ దర్శనం అనంతరం అనంతపురం మీదగా గుత్తికి బయల్దేరారు. గార్లదిన్నె మండలం రామదాస్‌పేట గ్రామ మలుపు వద్దకు రాగానే కారు వేగం అదుపు కాక రెండు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో కృష్ణమోహన్, కూతురు ఆశా అక్కడిక్కడే చనిపోయారు. భార్య సౌభాగ్య లక్ష్మి, కారు డ్రైవర్ మధు తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న సౌభాగ్య లక్ష్మి భర్త, కుమార్తెల మృతదేహాలపై పడి బోరున విలపిచింది. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ రోదించింది. అనంతరం క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. సౌభాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదే హాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉదయం వరకు అందరితో కలిసి ఉన్న కుటుంబంలో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, మరొక కుటుంబ సభ్యరాలు తీవ్రంగా గాయపడటంతో గుత్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment