చిన్నారులను మింగిన కుంట ఇదే, చిన్నారుల మృతదేహాల వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు
వెదురుకుప్పం: ఆ దంపతులు తమ కుమార్తెలను కుమారులకన్నా ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని భావించారు. ఉన్నంతలోనే ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. ఈత కోసం వెళ్లిన చిన్నారులను నీటి కుంట రూపంలో మృత్యువు కబళించింది. దీంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. మండలంలోని నచ్చుకూరు గ్రామానికి చెందిన మునెమ్మ మనుమరాళ్లు ఓజశ్విని(5), హేమలత (12) సోమవారం రెడ్డి చెరువుకుంటలో ఈత నేర్చుకునేందుకు వెళ్లి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
వ్యవసాయ కుటుంబమైనా...
నచ్చుకూరు గ్రామానికి చెందిన ఆదికేశవులు రెడ్డి, మునెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు చిరంజీవిరెడ్డి, భార్గవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరు కొన్నేళ్ల క్రితం పెద్ద కుమార్తెను తీసుకుని బెంగళూరు వెళ్లి అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. చిన్నకుమార్తె ఓజశ్విని నాయనమ్మ వద్ద ఉంటూ పెనుమూరు తిరుమల ఆదర్శ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. వీరు మగపిల్లలు లేరన్న బెంగను పక్కన పెట్టి కుమార్తెలను బాగా చదివించాలని అనుకున్నారు. కూలి పనులు చేయగా వచ్చిన డబ్బులతో బిడ్డలను చదివించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా మునెమ్మ రెండవ కుమార్తె తులసీని పెనుమూరు మండలం అడవిపల్లె గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. వారికి కుమార్తె, కుమారుడు సంతానం. కుమార్తె హేమలత(12) అమ్మమ్మ ఇంట్లో ఉంటూ పెనుమూరు తిరుమల ఆదర్శ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. హేమలత తల్లిదండ్రులకు పెద్దగా ఆస్తులు లేకపోయినా ఉన్న పొలంలో పంటలు సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మోహన్‌రెడ్డి కుమారుడు తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు. ఈత రూపంలో ఓజశ్విని, హేమలతను మృత్యువు కబళించి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. విషయం తెలుసుకున్న విద్యా సంస్థ యాజమాన్యం, తోటి పిల్లలు వచ్చి కంటతడి పెట్టారు. మంచంపై చిన్నారుల మృదేహాలను చూసి మేం ఏం పాపం చేశాం దేవుడా.. మాకు ఇంతటి శిక్ష విధించావు అంటూ బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment