రెండు కుటుంబాల్లో విషాదం | Two Young Men Missing in Beach East Godavari | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన అలలు

Published Sat, Jan 25 2020 1:01 PM | Last Updated on Sat, Jan 25 2020 1:01 PM

Two Young Men Missing in Beach East Godavari - Sakshi

తొండంగి మండలం వేమవరంలో శివరాత్రికి ముందు వచ్చే  తీర్థానికి గురువారం రాత్రి ఆరుగురు యువకులు వెళ్లారు. ఆ రాత్రంతా ఆ జాతరలో సందడి చేశారు ...  తీర్థం ముగిసిన వెంటనే అమావాస్య రావడంతో జి.ముసలయ్యపేట గ్రామ సమీపంలోని తీరంలో ఉదయాన్నే సముద్ర స్నానం చేయాలనుకున్నారు. ఇసుక తిన్నెలపై కాసేపు ఆడుకున్నారు...సెల్ఫీలు తీసుకున్నారు. ఆ వెంటనే ఎగసి వస్తున్న అలలకు ఎదురీది చేపపిల్లల్లా ఈతకొట్టారు. ఉప్పొంగిన వారిలోని ఉత్సాహాన్ని చూసిన ఆ సంద్రానికి కన్నుకుట్టిందేమో! ఇద్దరిని తనలోకి లాగేసుకుంది. కెరటాల మధ్య ఆర్తనాదాలు చేస్తున్న వారిద్దర్నీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో దగ్గర్లో ఉన్న జాలర్లను ఆశ్రయించారు. వలలతో గాలించినా ఫలితం లేకపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కేరింతలతో ఉత్సాహం ఉరకలేసిన ఆ తీరప్రాంతం క్షణాల్లోనే విషాదం అలముకుంది.

తూర్పుగోదావరి, తొండంగి: వారికి సముద్రం కొత్తేమీ కాదు.. ఇంటి ముంగిట ఉన్న సముద్రంలో నిత్యం వారు ఆటలాడుకుంటూనే ఉంటారు. అయితే విధి అల రూపంలో వచ్చి స్నానానికి వచ్చిన ఇద్దరు మిత్రులను కడలిగర్భంలోకి లాక్కుపోయింది. అలా ఇద్దరు గల్లంతవడం రెండు కుటుంబాల్లో తీరని వి«షాదాన్ని నింపింది. 

వివరాల్లోకి వెళితే..  తొండంగి మండలం జి.ముసలయ్యపేట గ్రామానికి అతి సమీపంలో సముద్రం ఉంది. ఏటా మహాశివరాత్రికి ముందువచ్చే అమావాస్య నాడు వేమవరంలో తీర్థం జరుగుతుంది. గురువారంరాత్రి తీర్థం ముగిశాక శుక్రవారం సముద్ర స్నానం చేయడం సంప్రదాయం. ఆ విధంగానే శుక్రవారం ఉదయం నుంచి పలువురు సముద్రస్నానాలు చేశారు.  జి.ముసలయ్యపేటకు చెందిన తాటిపర్తి మణికంఠ (20), అతని తమ్ముడు కుమారస్వామితోపాటు తాటిపర్తి శ్రీను (19), బద్ది మణికంఠ, శివ, రాజు గురువారం వేమవరంలో తీర్థానికి వెళ్లి వచ్చారు. శుక్రవారం ఉదయం సముద్రతీరంలో చలిమంట కాగారు. వారందరూ కలిసి సెల్‌ఫోన్లతో సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. తీరంలో కొంత సేపు ఆటలాడుకున్నారు. ఇళ్లకు వెళ్లి బట్టలు మార్చుకుని తిరిగి సముద్రతీరానికి స్నానానికి వచ్చారు. పెద్ద ఎత్తున వచ్చిన రాకాసి అలలు తాటిపర్తి మణికంఠ, అతని తమ్ముడు కుమారస్వామి, తాటిపర్తి శ్రీనులను లోపలికి లాక్కెళ్లాయి. శ్రీను దూరంగా గల్లంతవ్వగా మణికంఠ, కుమారస్వామి ఒకేచోట సముద్రంలో తీరానికి దూరంగా కొట్టుకెళ్లారు. దాదాపు అరంగట సేపు అన్న మణికంఠను రక్షించేందుకుప్రయత్నించినా తన చేతకాకపోవడంతో తీరానికి ఈతకొట్టుకుని వచ్చి ప్రాణాలతో బయటపడ్డానని కుమారస్వామి వెల్లడించారు. సముద్రంలో ఇద్దరు గల్లంతైన సమాచారం అందడంతో రెండు కుటుంబాలకు చెందిన వారితోపాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సముద్రతీరానికి చేరుకున్నారు.  తాటిపర్తి మణికంఠకు తండ్రి సత్తిబాబు, తల్లి మంగ, అన్న శ్రీను, అక్క రమణమ్మ, తమ్ముడు మణికంఠ ఉన్నారు. కాగా తాటిపర్తి శ్రీనుకు తల్లినాగరాజు (నాగేశ్వరరావు), తల్లి చంటమ్మ, అక్క శివ దుర్గ ఉన్నారు. వారి రోదనలతో సముద్రతీరంలోని వారు విషాదసాగరంలో మునిగిపోయారు.  తొండంగి ఎస్సై విద్యాసాగర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

గల్లంతైన ఇద్దరూ చదువులో రాణించినవారే
గల్లంతైనవారిలో తాటిపర్తి మణికంఠ విశాఖపట్నంలో హోటల్‌మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు. సెలవులు ముగిసిన అనంతరం కాలేజీకి వెళ్లాల్సి ఉండగా వేమవరం తీర్థంలో సందడి చేసి శుక్రవారం సముద్ర స్నానం చేసి ఆదివారం వెళ్తానని తెలిపాడని స్నేహితుడు శివ కన్నీటిపర్యంతమై చెప్పాడు. తాటిపర్తి శ్రీను తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. 

ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా విచారం
జి.ముసలయ్యపేటలో యువకులు గల్లంతైన సంగతి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తెలియడంతో ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, వారికి భరోసా కల్పించాలని పార్టీనాయకులను ఆదేశించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు కొయ్యా మురళి, జిల్లా కమిటి సభ్యుడు నాగం గంగబాబు, యాదాల జోగిరాజు, మత్స్యకార నాయకులు చొక్కా కోదండ, మేరుగు ఆనందహరి, మడదా హేమంత్,  చొక్కా రామచంద్రరావు తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.

గల్లంతైనవారి కోసంవెతుకులాట  
ఉదయం గల్లంతైన యువకుల కోసం ఎల్లయ్యపేట, ఇతర మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకారులు సుమారు వందమందికి పైగా సముద్రతీరంలో బోట్లుపై వలలు వేసి గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు పదిగంటల పాటు సముద్రతీరంలో గాలించారు. రాత్రి సమయానికి కూడా వారి జాడ తెలియరాలేదు.

అన్నను రక్షించుకునేందుకు విశ్వప్రయత్నం చేశా
నాతోపాటు నా అన్న మణికంఠ మరో నలుగురం స్నానానికి దిగాం. పెద్ద కెరటాలు రావడంతో శ్రీనుతోపాటు మా అన్న మణికంఠ నేను నీటిలో మునిగిపోయాం. అన్నను వదలకుండా ఉండడంతో ఇద్దరం లోపలికి వెళ్లిపోయాం. దాదాపుగా అరగంటసేపు ఈత కొడుతూ ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించాం. అన్న నీళ్లలో మునిగిపోయాడు. రక్షించుకునేందుకు చాలా ప్రయత్నించాను. కానీ దక్కించుకోలేకపోయాను. – తాటిపర్తి కుమారస్వామి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement