సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ కార్డు సమాచారం లీకులంటూ ఈ మధ్య కొన్ని కథనాలు ప్రచురితం కావటం యూఐడీఏఐ చికాకు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలను ప్రచురిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది.
ఈ మధ్య కేవలం రూ.500కే కోట్ల మంది ఆధార్ వివరాలు.. అంటూ ది ట్రిబ్యున్ పత్రిక స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఓ కథనం ప్రచురించింది. వాట్సాప్‌లో ఓ గ్రూప్ ద్వారా లీకులు జరుగుతున్నాయని.. లాగిన్ వివరాలు ఉంటే ఆధార్ డేటా బేస్‌లోకి చొరబడి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సులభంగా పొందవచ్చని ట్రిబ్యూన్ తన కథనంలో పేర్కొంది. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదంటూ కాసేపటికే యూఐడీఏఐ ప్రకటన చేసింది. అటుపై కథనంపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ట్రిబ్యూన్ రిపోర్టర్ రచన ఖైరాపై కేసు నమోదు అయ్యింది.
క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమీషనర్‌కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. రచనతోపాటు ఈ వార్త విస్తృత ప్రచారం కావటానికి కారణమైన అనిల్ కుమార్, సునీల్, రాజ్‌ల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు. మరో జాతీయ మీడియా ఛానెల్‌పై కూడా ఫిర్యాదు చేసేందుకు యూఐడీఏఐ సిద్ధమౌతోందని సమాచారం. కాగా, ఆధార్ కార్డు గోప్యతపై అసత్య ప్రచారాలు మానుకోవాలని మీడియాకు చెబుతున్న యూఐడీఏఐ.. ఆ వార్తలను వాట్సాప్‌లో వైరల్ చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక కార్డుల్లో తప్పుల సవరణ విధానాన్ని దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని ఏజెంట్లను హెచ్చరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment