నళిని (ఫైల్)
నళిని 2017 నుంచి కన్పించడం లేదు. ఆమెను ఆ సీఐ చంపేసి ఆనవాళ్లు కనుక్కోకుండా శవాన్ని కూడా కాల్చేశాడని ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏమైనట్లు.. ప్రాణాలతో ఉందా.. ఉంటే ఎక్కడుంది.. లేదంటే వారు చెప్పినట్లు చంపేశారా? దీనికి కారకుడైన ఆ సీఐకి తెలుగుదేశం పార్టీ పెద్దల అండదండలు ఉండటంతో గత ప్రభుత్వంలో పోలీసులు ఈ కేసును తొక్కి పెట్టారని వారి ఆరోపణ. ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని ఆయనను కలిసి మా గోడు చెప్పుకుటామని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంతకీ ఎవరా నళినీ... ఏమిటా మిస్టరీ..?
సాక్షి, కదిరి: కదిరి పట్టణానికి చెందిన రిటైర్డ్ హెల్త్ ఉద్యోగి కె.శ్రీరాములు భార్య నళిని. వీరికి డిగ్రీ పూర్తి చేసుకున్న సందీప్, అశోక్ అనే ఇద్దరు కుమారులున్నారు. సజావుగా సాగుతున్న వారి కాపురంలో ఆమెకు ఓ సీఐ పరిచయమైన తర్వాత గొడవలు మొదలయ్యాయి. భర్తతో కలిసి ఉన్నప్పుడే ఆమె తన భర్త నుంచి తనకు ప్రతి నెలా భరణం ఇప్పించాలని 2013 నవంబర్‌లో కదిరి కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆమెకు ప్రతి నెలా రూ.3 వేలు ఇవ్వాలని ఆదేశించడంతో అలాగే ఇస్తూ వచ్చాడు. తనతో కలిసి ఉండగానే ఆమె ఇలా చేయడమేంటని ఆయన 2016 ఆగస్టులో పదవీ విరమణ అనంతరం భార్యకు దూరంగా ఉంటూ పెద్ద కుమారుడు సందీప్‌తో కలిసి అనంతపురానికి కాపురం మార్చేశాడు. దీంతో ఆమె తన చిన్న కొడుకు అశోక్‌తో కలిసి కదిరిలోనే ఉండేది. చిన్న కొడుక్కు బెంగుళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. తరచూ వచ్చి తల్లిని చూసి వెళ్లేవాడు.
తిరుపతికని వెళ్లి తిరిగి రాలేదు
2017 మార్చి 14న అశోక్‌కు తల్లి నళిని ఫోన్ చేసి ‘నాకు ఆరోగ్యం బాగాలేదు. కిడ్నిలో రాళ్లు ఉన్నాయని డాక్టర్ చెప్పారు. తిరుపతికి వెళ్లి అక్కడ పెద్ద డాక్టర్ల దగ్గర చూపించుకొని వస్తాను’ అని చెప్పడంతో సరేనన్నాడు. ఆ తర్వాత తల్లి దగ్గర నుంచి ఎటువంటి ఫోన్లు రాకపోవడంతో కదిరికి వచ్చి వెదికాడు. చేసేది లేక నాన్నతో పాటు అన్న సందీప్‌కు విషయం తెలియజేశాడు. వారు వెంటనే తిరుపతికి వెళ్లి ఆసుపత్రులన్నీ విచారించారు. ఎక్కడా వైద్యం చేయించుకోలేదని నిర్ధారించుకొన్నాక 2017 ఏప్రిల్ 29న అశోక్ తన తల్లి నళిని కన్పించడం లేదంటూ కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు(క్రైం.నెం134/17)నమోదు చేశారు.
గంగమ్మ మోరీ వద్ద గుర్తు తెలియని శవం
తమ తల్లి ఆచూకీ ఏమైందంటూ అశోక్‌తో పాటు అన్న సందీప్, నాన్న శ్రీరాములు కలిసి ఓ రోజు కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అడిగారు. దీంతో అక్కడున్న పోలీసు అధికారులు 2017 మార్చి 9వ తేదీన కదిరి మండలం ఎర్రదొడ్డి వద్ద ఓ మహిళను ఎవరో చంపేసి గుర్తు పట్టకుండా శవాన్ని కాల్చేశారని చెప్పారు. ఆమెకు సంబందించిన చెవి కమ్మలు, కాలి గొలుసులు, ఇతర ఆనవాళ్లు చూపెట్టడంతో ఆమె తమ తల్లే అని ఇద్దరు కొడుకులతో పాటు ఆమె భర్త కూడా పోలీసుల ఎదుట పేర్కొన్నారు. డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆమె కుమారుడు అశోక్ బ్లడ్ శాంపిల్స్‌కు అవి సరిపోవడం లేదంటూ డీఎన్‌ఏ నివేదికలో వచ్చింది.
మరి నళిని ఏమైనట్లు..?
ఆనవాళ్లను బట్టి గంగమ్మ మోరీ దగ్గర చనిపోయింది తమ తల్లే అని ఆమె కుమారులు చెబుతున్నప్పటికీ డీఎన్‌ఏ రిపోర్ట్‌లో అందుకు విరుద్ధంగా రావడంతో ఎవరికైనా అనుమానం కలగక తప్పదు. అయితే నళిని భర్త ఓసారి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విచారించగా పోలీసులు పంపిన శరీర భాగాలు మహిళవి కావని, అవి పురుషుడికి సంబంధించినవి కావడంతోనే మీ కుమారుడి రక్త నమూనాలతో సరిపోవడం లేదని అసలు విషయం చెప్పారు. దీంతో ఆయన అనుమానం నిజమైంది. ఆమెకు ఓ సీఐతో వివాహేతర సంబంధం ఉందని, ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారి ఒత్తిడి కారణంగా అప్పట్లో ఆ కేసును నీరు గార్చేశారని నళినీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆ సీఐ చంపేశాడు
చిత్తూరు జిల్లా పుత్తూరు (ప్రస్తుతం తిరుమల సీసీఎస్)సీఐగా ఉండే డి.కొండయ్యకు నా భార్య నళినితో కొనేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆమె తిరుమల శ్రీవారి సన్నిధిలో సేవ పేరుతో ప్రతి నెలా 10, 15 రోజులు వెళ్లేది. మాకు అప్పుడు అనుమానం రాలేదు. నళినీ 2017 మార్చి 9 నుంచి కన్పించడం లేదు. అదే రోజు కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ మోరీ వద్ద ఓ మహిళను చంపేసి శవాన్ని కూడా కాల్చేశారు. ఆమే నా భార్య అని ఆనవాళ్లను బట్టి నేను గుర్తించాను. అయితే ఆమె చనిపోయిన తర్వాత కూడా 6 నెలల పాటు ఆమె వాడుతున్న ఆండ్రాయిడ్ సెల్ ఫోన్‌లో అతను అఫీషియల్ సిమ్ వేసుకొని ఉపయోగించాడు. ఆమె వాడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్ నెం.94928 92028తో పాటు జియో నెం.83091 45636 నుంచి నా సెల్(నెం.94911 64082)కు 2017 ఏప్రిల్ 22న ఉదయం 10.24 గంటలకు 11 మిస్డ్ కాల్స్ వచ్చాయి. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తే ‘నా పేరు సుధాకర్‌రెడ్డి. మాది పులివెందుల.
నేను నీ పెళ్లాం నళినీ పెళ్లి చేసుకొని బెంగుళూరులో కేఆర్ పురంలోని ఐశ్వర్య అపార్ట్‌మెంట్‌లో ఉన్నాము. మా కోసం ఆరా తీశావో నీ కొడుకులు ఇద్దరినీ చంపేస్తాను’ అని బెదిరించాడు. ఈ విషయం అప్పటి జిల్లా ఎస్పీకి 2017 ఏప్రిల్ 24న రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశాను. తర్వాత తాను సీఐనని కూడా ఫోన్ చేసి చెబుతూ మళ్లీ బెదిరించాడు. నా భార్య కేసు ఏమైందంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందున ఆ సీఐకి ఆ పార్టీ పెద్దల అండదండలు ఉన్నాయి. అందుకే ఆ కేసు ముందుకు సాగలేదని మేము భావిస్తున్నాము. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మా బాధ చెప్పుకుంటాం. మాకు న్యాయం చేసి, ఖాకీ ముసుగులో ఉన్న ఆ నేరస్థుడిని పట్టుకొని శిక్షించాలని కోరతాం. – నళినీ భర్త శ్రీరాములు
Comments
Please login to add a commentAdd a comment