
సాక్షి, బెంగళూరు : సంచలనం సృష్టించిన మంగళూరు పబ్ కేసులో నిందితులను కోర్టు వదిలేసి అందరిని షాక్‌కు గురిచేసింది. సరైన ఆధారాలు నిందితులకు వ్యతిరేకంగా సమర్పించలేకపోయారని, ప్రత్యక్ష సాక్షులమంటూ కోర్టుకు వచ్చిన వారు సైతం స్పష్టమైన వివరాలు వెల్లడించలేపోయారంటూ కోర్టు వారిని విడిచిపెట్టిన సందర్భంగా తెలిపింది. 2009లో జనవరిలో యూట్యూబ్‌లో వచ్చిన ఓ వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మంగళూరులోని పబ్‌లో చోటుచేసుకున్న అభ్యంతరకర దాడుల దృశ్యాలే ఆ వీడియో. నైతిక విలువలు కోల్పోయి, విలువలకు తిలోదకాలు ఇచ్చి సంస్కృతిని దెబ్బకొడుతున్నారనే కారణంతో శ్రీ రామ్ సేన అనే ఓ వర్గం మంగళూరులోని 'ఆమ్నేసియా-దిలాంజ్' అనే పబ్‌లోకి చొరబడి అందులోని యువతి యువకులపై దాడులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ మేరకు యువతులపై దాడులకు పాల్పడిన అస్పష్టమైన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్‌తోపాటు మొత్తం 30మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. అయితే, ఆ దాడికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలు ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ సమర్పించలేదని కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు పలువురిని విస్మయానికి గురిచేసింది. అయితే, కోర్టుకు స్పష్టమైన ఆధారాలే ముఖ్యం అని, భావోద్వేగాల ఆధారంగా, అభిప్రాయాల ద్వారా తీర్పులు చెప్పలేమని తెలిపింది. తమకు సమర్పించిన వీడియోల్లో కేవలం నీడలు మాత్రమే కనిపించాయని, వీరే స్పష్టం అనడానికి ఆధారాలు లేవని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment