చిన్నారి అపహరణకు గురైందని ఫిర్యాదు వచ్చిన వెంటనే విజయవాడ నగర పోలీసులు వేగంగా స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో నిందితుడి ఆచూకి తెలుసుకున్నారు. నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించారు. రెండు నెలల ఆరు రోజుల చిన్నారి దేవికా వెంకట ధాత్రిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
సాక్షి, అమరావతి : చిన్నారి అపహరణకు గురైందని ఫిర్యాదు వచ్చిన వెంటనే విజయవాడ నగర పోలీసులు వేగంగా స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో నిందితుడి ఆచూకీ తెలుసుకున్నారు. నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించారు. రెండు నెలల ఆరు రోజుల చిన్నారి దేవికా వెంకట ధాత్రిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులోని మాదు తిరుపతిరావు నగర్‌లో చల్లా అమర్నాథ్, చల్లా కమలకుమారి దంపతులు నివసిస్తున్నారు. అమర్నాథ్ గుంటూరులోని సిల్క్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జూలై 27న కమలకుమారి పాపకు జన్మనిచ్చింది. చిన్నారికి దేవికా వెంకట ధాత్రిగా పేరు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన కుమార్తెను తన పెద్దనాన్న కుమారుడైన కుడిపుడి అఖిల్‌కు అప్పగించి స్నానం చేయడానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి పాప, అఖిల్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కలా గాలించారు. అయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో 5 గంటల సమయంలో పెనమలూరు పోలీసుస్టేషన్‌లో పాప కనిపించలేదని ఫిర్యాదు చేశారు.
రెండు గంటల్లో కనిపెట్టారు..
విషయం తెలిసిన వెంటనే నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు డీసీపీ–1 హర్షవర్థన్ నేతృత్వంలో సెంట్రల్‌జోన్ ఏసీపీ నాగరాజురెడ్డి, పెనమలూరు సీఐ ఆధ్వర్యంలో నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీల ఫుటేజీలను పరిశీలించగా.. యనమలకుదరు కొండవెనుక ఉన్న సాయిబాబా దేవాలయానికి చెందిన సీసీ టీవీ ఫుటేజీలో కుడిపుడి అఖిల్ ఒక బ్యాగు తీసుకుని వెళ్తున్నట్లుగా గుర్తించారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 7 గంటల సమయంలో పెనమలూరులో నిందితుడిని గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా కిడ్నాప్ వివరాలు వెల్లడించాడు. అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోగా.. తన బ్యాంకు అకౌంట్ ఉన్న డబ్బును సైతం తల్లి డ్రా చేసుకోనివవ్వడం లేదనే కారణంతో పాపను కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు.
బ్యాగ్‌లో పెట్టి.. పొలాల్లో వదిలేసి..
కుటుంబసభ్యులపై ఉన్న కోపంతో తన మేనకోడలిని కిడ్నాప్ చేసిన కుడిపుడి అఖిల్ పాపను ఒక బ్యాగ్‌లో దాచిపెట్టి సైకిల్‌పై తన తండ్రి కుడిపుడి ఏడుకొండలతో కలిసి పెదపులిపాక వైపు తీసికెళ్లాడు. సుమారు 6 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత పాపను బ్యాగ్‌లో నుంచి బయటకు తీసి సమీప పొలాల్లో వదిలేసి అక్కడి నుంచి వెనక్కి ఇంటికి వచ్చేశాడు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో అఖిల్ ఇంటికి తిరిగా రాగా, తండ్రి ఏడుకొండలు ఆచూకీ తెలియలేదు. దీంతో కమలకుమారి పాప గురించి ప్రశ్నించగా నాకు తెలియదని చెప్పడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు విచారించి పాపను విడిచిపెట్టిన ప్రాంతం వివరాలు వెల్లడించడంతో పోలీసులు వెంటనే పెదపులిపాక ప్రాంతానికి చేరుకుని పాపను రక్షించారు. పోలీసులు వెళ్లిన సమయానికి పాప ధాత్రి ఆడుకుంటూ కనిపించింది. దాదాపు రెండు గంటలపాటు ఒంటిరిగా ఉన్న చిన్నారిపై ఏదైనా జంతువుకానీ, కుక్కలు వంటికానీ దాడి చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే పాపను చికిత్స నిమిత్తం పాత ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. రెండు గంటల్లో చిన్నారి ఆచూకీని కనిపెట్టిన పోలీసులను కమిషనర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment