వాచ్‌మెన్ కొట్టడంతో వాతలు తేలిన పవన్ కల్యాణ్ తొడ
రాయపోలు (దుబ్బాక): మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాల వాచ్‌మన్ తప్పతాగి విద్యార్థులను చితకబాదాడు. దీంతో ఓ విద్యార్థి చేతికి తీవ్రంగా గాయమవగా.. మరో విద్యార్థికి వీపు, కాళ్లు, తొడలపై వాతలు పడ్డాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. దౌల్తాబాద్ మండల కేంద్రానికి సమీపంలోని బీసీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దౌల్తాబాద్‌కు చెందిన పులుగారి పవన్‌కల్యాణ్ గౌడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నిజాంపేటకు చెందిన విష్ణుతేజలు శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చారు.
అదే పాఠశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న శంభులింగానికి వీరు తారసపడ్డారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు విద్యార్థులను ఇష్టమొచ్చినట్లు తిట్టి, వాతలు పడేలా కొట్టాడు. పవన్‌కల్యాణ్‌ది దౌల్తాబాద్ కావడంతో అతను వెళ్లి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వచ్చి విద్యార్థులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం శంభులింగంపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. శంభులింగం నిత్యం మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్న విషయం ప్రిన్సిపల్, సిబ్బందికి తెలిసినా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని విధుల నుంచి తొలగించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ఉపాధ్యాయులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment