
లక్నో : వివాహేతర సంబంధానికి ఒప్పుకోలేదనే కారణంతో ఓ మహిళను అతి క్రూరంగా చంపేశాడో వాచ్‌మెన్. అతడితో మాత్రమే కాకుండా మరో స్నేహితుడితో కూడా ఆ సంబంధం పెట్టుకోవాలని వేధించాడు. దానికి ఒప్పుకోకపోవడంతో మహిళను దారుణంగా హత్య చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ సంఘటన పెను సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ ప్రాంతంలో ఉండే సుశీల్(40) వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వివేక్ విహార్ ఏరియాలో ఖాళీగా ఉండే ఓ ఇంటికి కాపలా కాస్తున్నాడు. కాగా అదే ప్రాంతంలో ఉండే 42 ఏళ్ల మహిళపై సుశీల్, అతని స్నేహితుడు మోజు పడ్డారు. ఈ నెల 6న ఇంటి ముందు నుంచి వెళుతున్న మహిళను లోపలికి పిలిచి... తమ కోరిక తీర్చమని బలవంత చేశారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆవేశంతో ఆమెపై దాడి చేసి గొంతు పిసికి చంపేశారు. ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. మహిళ మృతదేహన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టంకి తరలించారు. అనంతరం ఆ ఇంటి వాచ్‌మెన్ అయిన సుశీల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లోనే అతన్ని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. అతని స్నేహితుడు మాత్రం పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారి పేర్కొన్నారు. ఆ ఇంట్లో సుశీల్ ఎన్నో రోజుల నుంచి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నాడని స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment