కుమార్తెలు, భర్త సోమశేఖర్‌తో సత్యవేణి(ఫైల్)
సాక్షి, పెంటపాడు: హైదరాబాద్ గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ జంక్షన్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో పెంటపాడుకు చెందిన పసల సత్యవేణి(56) మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. సత్యవేణికి భర్త పసల సోమశేఖర్, కుమార్తెలు ప్రణీత, వాణి ఉన్నారు. ఆమె మృతదేహం ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చింది. ఆమె మృతి విషయాన్ని తెలుసుకున్న బంధువులు పెంటపాడుకు చేరుకున్నారు. మృతికి కారణమైన కారు డ్రైవర్‌కు తీవ్ర శిక్ష విధించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె బంధువులు కోరుతున్నారు.
కుటుంబ నేపథ్యం
మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో పసల సూర్యచంద్రరావు శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ఆయన సోదరుని మనుమడైన సోమశేఖర్‌కు సత్యవేణితో వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రణీతకు రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. రెండో కుమార్తెకు హైదరాబాద్‌లో 6 నెలల క్రితం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో వారి కుటుంబం పెంటపాడు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చారు. హైదరాబాద్‌లోని మణికొండలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కాగా అక్కడి నుంచి హైటెక్ సిటీకి ఉద్యోగం కోసం వచ్చేందుకు ఆడపిల్లలకు ఇబ్బందులు ఎదురవడంతో కేపీహెచ్‌బీ కాలనీలో ఇల్లు చూసేందుకు సత్యవేణి శనివారం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఇక్కడ పెంటపాడులో వారి బంధువుల ఇళ్లలో విషాదఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్‌లో పోస్ట్‌మార్టం అనంతరం సత్యవేణి మృతదేహాన్ని స్వగ్రామం పెంటపాడుకు తరలించారు. మృతదేహం ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామానికి చేరగా అంత్యక్రియలు పూర్తిచేశారు.
పలువురి పరామర్శ
కాగా సత్యవేణి మృతితో ఆమె కుటుంబీకులను బంధువులు, స్నేహితులు పరామర్శించి సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, విప్పర్రు, ముదునూరు సొసైటీల మాజీ అధ్యక్షులు పసల అచ్యుతం, బండారు సత్యనారాయణ, కాపు సంఘ నాయకులు పాలూరి రాంబాబు, పెంటపాడు మండల వైసీపీ కనీ్వనర్ బండారు నాగు, ముదునూరు త్రిసభ్య కమిటీ సభ్యుడు జామి కృష్ణ, వైసీపీ జిల్లా నాయకులు నల్లమిల్లి విజయానందరెడ్డి, యూత్ అధ్యక్షుడు కొవ్వూరి విజయభాస్కరరెడ్డి తదితరులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment