
గురుజు సూర్య నారాయణ(ఫైల్ ఫొటో)
ఉద్యోగరీత్యా ఆయన వేరే రాష్ట్రంలో స్థిరపడ్డారు.. సొంతూరిపై మమకారం, బంధువులను చూసేందుకు ఏడాదికోసారి ఇక్కడికి వస్తుంటారు. నాలుగురోజులు ఇక్కడే సరదాగా కుటుంబసభ్యులతో గడిపి తిరిగి వెళుతుంటారు. ఈ ఏడాది కూడా అలా సరదాగా భార్య, కుమార్తెతో ఆయన తన స్వగ్రామానికి రైలులో బయల్దేరారు.
మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. రైలు రూపంలో మృత్యువు వారిని వెంబడించింది. పట్టాలు దాటుతుండగా ఢీకొట్టింది. దీంతో భార్యతోపాటు మృత్యువాత పడ్డారు. తీవ్ర విషాదకర సంఘటన కన్నకూతురుతో పాటు, బంధువులను శోకసంద్రంలో ముంచింది.
పిఠాపురం టౌన్ : పిఠాపురం మండలం విరవాడ గ్రామానికి చెందిన గురుజు సూర్యనారాయణ(45) త్రిపురలోని రైల్వే ఆసుపత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్నారు. చాలా ఏళ్లుగా అక్కడే భార్య వెంకటలక్ష్మితో కలసి నివాసం ఉంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఒక కుమార్తె థెరిస్సాకి వివాహం చేశారు.
ఆమె పిఠాపురంలోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటుంది. మరో కుమార్తె చంద్రకళ(20), కొడుకు నాని(18) తనతో పాటే త్రిపురలో ఉంటున్నారు. కొడుకు డిగ్రీ చదువుతున్నాడు.
ఏటా త్రిపుర నుంచి పిఠాపురం వచ్చి తన పెద్దకూతురు థెరిస్సా ఇంటికి, అలాగే విరవాడ గ్రామంలోని తన సొంతిల్లు చూసుకుని బంధువులతో గడపడానికి వస్తుంటారు.
ఈ ఏడాదీ సూర్యనారాయణ తన భార్య వెంకటలక్ష్మి, చిన్నకుమార్తె చంద్రకళతో కలసి త్రిపుర నుంచి బయల్దేరి సూపర్ ఫాస్ట్ రైలులో విశాఖపట్నంలో దిగాడు. అక్కడి నుంచి పిఠాపురం రావడానికి గురువారం రాత్రి రాయగడ పాసింజర్ ఎక్కి అర్ధరాత్రి పిఠాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.
ఇక్కడ వరకు ప్రయాణం బాగానే సాగింది. రెండో నంబర్ ఫ్లాట్‌ఫారంలో దిగిన వీరందరూ బయటకు వెళ్లడానికి రైల్వే స్టేషన్‌లోని ఫుట్‌పాత్ బ్రిడ్జిని ఆశ్రయించకుండా ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫారం మీదకు వచ్చేందుకు పట్టాలు దాటుతుండగా విశాఖపట్నం వైపు వెళ్లే ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో ఢీకొట్టింది.
అప్పటికే చిన్నకుమార్తె చంద్రకళ ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫారం మీద కు ఎక్కేయగా ప్రాణాలతో బయటపడింది. తన భార్య వెంకటలక్ష్మి పట్టాల మీద నుంచి ప్లాట్‌ఫారం మీదకు ఎక్కేందుకు సూర్యనారాయణ సహకరిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న సామర్లకోట రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. చెల్లాచెదురుగా పడిన మృతుల శరీర భాగాలను పోగు చేసి పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.