భర్తను కడతేర్చిన భార్య అరెస్టు | Wife Arrest in Husband Murder Case | Sakshi
Sakshi News home page

భర్తను కడతేర్చిన భార్య అరెస్టు

Published Tue, Jan 29 2019 1:45 PM | Last Updated on Tue, Jan 29 2019 1:45 PM

Wife Arrest in Husband Murder Case - Sakshi

హత్య కేసు నిందితులను చూపుతున్న సీఐ, ఎస్‌ఐ

వైఎస్‌ఆర్‌ జిల్లా, జమ్మలమడుగు: పవిత్రమైన మూడుముళ్ల బంధానికి నీళ్లు వదిలి వివాహేతన సంబంధం పెట్టుకుంది ఓ మహిళ. తన సుఖానికి అడ్డు ఉండకూడదని కట్టుకున్న వాడిని ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను రూరల్‌ సీఐ ఉమామహేశ్వరరెడ్డి సోమవారం వెల్లడించారు. ఈనెల 24వ తేదీన వేపరాల నుంచి తొర్రివేములకు వెళ్లే రహదారిలో కుమ్మర గురుప్రసాద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతుని తండ్రి కుమ్మర చిన్నబాలిశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హత్య కేసును క్షేధించటానికి మైలవరం ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో విస్తృత దర్యాప్తు చేశారు.  సోమవారం ఎస్‌ఐ, సిబ్బందితో కలిసి ఈడుగోని బావి వద్ద  అనుమానస్పదంగా వెళుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకుని వేరువేరుగా విచారించారు.

విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. మృతుడి భార్య కుమ్మర విజయప్రమీల రాణి తొర్రివేములకు చెందిన ఆటో డ్రైవర్‌ తీట్ల సురేష్‌ అలియాస్‌ సూరితో   రెండు సంవత్సరాలుగా వివాహేతన సంబంధం కలిగి ఉంది. ఈ విషయం భర్త గురుప్రసాద్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. అయితే భర్తను కడతేచ్చితే తమకు ఏ అడ్డు ఉండదని భావించిన భార్య ప్రియుడిని ఉసిగొల్పి పదివేల రూపాయలను ముట్టజేపింది. దీంతో అతడు భీమగుండం గ్రామానికి చెందిన కొమ్ముపెద్దిరాజు, చాకలి గురుస్వామి, ఉప్పలపాడు ఓబుల ప్రతాప్, మాదిగ ప్రతాప్‌లతో కలిపి హత్య చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 24వతేదీన గురుప్రసాద్‌ వేపరాల గ్రామంలో బెల్దారి పని ముగించుకుని మధ్యాహ్నం భోజనం చేయడం కోసం తొర్రివేములకు బయలుదేరాడు. దారిలో కాపుకాసి ఉన్న నలుగురు కలిసి గురుప్రసాద్‌ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. హత్యకు ఉపయోగించిన రాడ్లను , నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.  మృతుని భార్య విజయప్రమీలారాణితో పాటు, ప్రియుడు తీట్ల సూరి మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement