ప్రియుడితో కలిసి.. భర్తను స్కార్పియోతో తొక్కించి!! | A Wife Who Kills Her Husband In A Fornication | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి.. భర్తను స్కార్పియోతో తొక్కించి!!

Published Sat, Nov 23 2019 8:57 AM | Last Updated on Sat, Nov 23 2019 8:57 AM

A Wife Who Kills Her Husband In A Fornication - Sakshi

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పోలీస్‌ అధికారులు

సాక్షి, మైదుకూరు : వివాహేతర సంబంధం విషయమై భర్త పలుమార్లు మందలించడంతో.. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన ఆమె ప్రియుడితో కలిసి అంతమొందించింది. దువ్వూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును ఛేదించి.. ఆమెతోపాటు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం మైదుకూరు పోలీసు సబ్‌డివిజన్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ముడావత్‌ తులసీనాయక్, సాలిబాయికి 17 ఏళ్ల కిందట వివాహం అయింది. నాలుగేళ్ల కిందట వైఎస్సార్‌ జిల్లా టి.సుండుపల్లి మండలం మన్యంవారిపల్లెకు చెందిన మూడె రెడ్డినాయక్‌కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వెళ్లిన సాలిబాయి అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై ఆమెను భర్త తులసీనాయక్‌ పలు మార్లు మందలించాడు.
 
అడ్డుగా ఉన్నాడని.. 
తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి.. అతనిని అంతమొందిస్తే తాము సంతోషంగా ఉండవచ్చునని రెడ్డి నాయక్‌తో కలిసి సాలిబాయి కుట్రపన్నింది. అందులో భాగంగా రెడ్డినాయక్‌ తన స్నేహితులైన చక్రాయపేట మండలం ఎర్రగుడి తండాకు చెందిన వినోద్‌కుమార్‌ నాయక్, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అయితేపల్లె గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, విజయనగరం జిల్లా మండల కేంద్రమైన గంట్యాడకు చెందిన మునగపాటి జగన్నాథరాజుతో కలిసి.. తులసీనాయక్‌ను చంపేందుకు లక్ష రూపాయలకు సుఫారి ఖరారు చేసుకున్నారు. ఇందుకు రూ.30 వేలు అడ్వాన్సుగా చెల్లించారు.

కాగా రెడ్డినాయక్‌ సాలిబాయికి రూ.10 వేలు బాకీ ఉండటంతో.. ఆ సొమ్మును చెల్లిస్తానని ఈ నెల 12న తులసీనాయక్‌ను వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం చింతకుంట గ్రామ సమీపానికి పిలిపించారు. అక్కడ తులసీనాయక్‌కు మద్యం తాపారు. అనంతరం కుట్రలో సాలిబాయి ఆదేశాల మేరకు తులసీనాయక్‌ను మద్యం బాటిల్‌తో కొట్టారు. తులసీనాయక్‌ పారిపోబోగా తమ వద్ద ఉన్న స్కార్పియో వాహనంతో తొక్కించి చంపారు. అనంతరం శవాన్ని దువ్వూరు మండలం పెద్దజొన్నవరం మిట్ట దగ్గర జాతీయ రహదారి కల్వర్టు పక్కన పడేశారు. ఈ నెల 15న మృతదేహం ఉన్న విషయం తెలియడంతో దువ్వూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 

తప్పుదోవ పట్టించే యత్నం 
పోలీసులు కనుగొన్న శవం తన భర్తదేనని, ఆయన మరణానికి తమ గ్రామానికి చెందిన దమన పెద్దపుల్లయ్య కారణమని సాలిబాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సంఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు సాలిబాయి సెల్‌ఫోన్‌లోని కాల్‌ డేటాను పరిశీలించి.. ఆమె తన ప్రియుడు రెడ్డినాయక్‌తో రోజూ మాట్లాడుతున్నట్టు తెలుసుకున్నారు. ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించినట్టు నిర్ధారించారు. ఆ మేరకు మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్‌ ఆదేశాలతో రూరల్‌ సీఐ టీవీ కొండారెడ్డి, దువ్వూరు ఎస్‌ఐ ఎస్‌.కుల్లాయప్ప సిబ్బంది శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో రూరల్‌ సీఐ టీవీ కొండారెడ్డి, దువ్వూరు ఎస్‌ఐ కుల్లాయప్ప, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement