నిందితురాలు ఖదీరూన్ , శంకర్‌రెడ్డి (ఫైల్)
వైఎస్‌ఆర్ జిల్లా , రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణ పరిధిలోని రాయుడు కాలనీలో శనివారం రాత్రి కత్తి శంకర్‌రెడ్డి అనే వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటనకు వివాహేతర సంబంధమే కారణమని వెల్లడైంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి రూరల్ పరిధిలోని అబ్బవరం గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి పాతికేళ్ల క్రితం జీవనోపాధి కోసం రాయచోటికి వచ్చాడు. పదేళ్ల క్రితం రాయుడు కాలనీలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. కొంత కాలంగా చెక్‌పోస్టు వద్ద చిల్లర కొట్టు నిర్వహించుకుంటూ తన భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన ఖదీరూన్ అనే మహిళతో పరిచయమైంది. వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది.
ఆమె భర్త జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లడంతో వారి చనువు మరింత పెరిగింది. అయితే ఆమె కుమారుడు దీనిని జీర్ణించుకోకపోవడంతో వీరి మధ్య ఉన్న సంబంధం వికటించింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి శంకర్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఖదిరూన్‌తో పాటు ఆమె కుమారుడు కూడా ఇంటిలోనే ఉండటంతో వారి మధ్య గొడవ చోటు చేసుకొంది. ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో ముందు ఆమె కొడుకు క్రికెట్ బ్యాట్‌తో శంకర్ రెడ్డి తలపై మోదాడు. కొడుకుకు సాయంగా ఆమె కూడా కత్తిపీటతో గొంతు కోసింది. దీంతో శంకర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం ఆలస్యంగా తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేశారు. ఆదివారం సాయంత్రం వరకు పలు కోణాలలో దర్యాప్తు చేసిన పోలీసులు ఖదీరూన్, ఆమె కుమారుడు అమీర్‌లను అదుపులోకి తీసుకొన్నారు. అయితే వీరిద్దరితో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. దీనిపై అర్బన్ సీఐ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా హత్య కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నామని, వీరు ఇద్దరే హత్య చేశారా.. వీరికి మరెవరైనా సాయం చేశారా అనే కోణంలో కూడా విచారిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వీరికి సహకరించిన వారిని కూడా అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment