అనాథలుగా మారిన చిన్నారులు
రెబ్బెన(ఆసిఫాబాద్): భర్తకు కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన భార్యే తన పాలిట మృత్యువుగా మారింది. మామ పింఛన్ డబ్బుల కోసం భర్తతో గొడవపడి చివరికి కొడవలితో భర్త గొంతు కోసి హతమార్చింది. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి మండలంలోని రోళ్లపాడులో చోటుచేసుకుంది. ఎస్సై దీకొండ రమేష్ వివరాల ప్రకారం... చింతకుంట్ల శ్రీను(30), అంజలి అలియాస్ స్వప్న భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఏడేళ్ల కొడుకు తిరుపతి, ఐదేళ్ల కూతురు సువర్ణ ఉన్నారు. భార్యాభర్తలకు మద్యం సేవించే అలవాటుతో బానిసలుగా మారారు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో మద్యం సేవించి తరుచుగా గొడవ పడేవారు.
ఈ క్రమంలో మంగళవారం శ్రీను తండ్రి పోచయ్యకు పింఛన్ డబ్బులు వచ్చాయి. తండ్రి వద్ద నుంచి రూ.600 కొడుకు శ్రీను అడిగి తీసుకున్నాడు. సాయంత్రం ఆ విషయం భార్యకు తెలియటంతో డబ్బుల కోసం ఇద్దరి మధ్య గొడవైంది. ఆ డబ్బులు తన వద్ద లేవని, ఖర్చు చేశానని శ్రీను చెప్పడంతో కోపంతో రగిలిపోయింది. మంచంపై నిద్రిస్తున్న భర్తను అర్ధరాత్రి కొడవలితో గొంతుకోసింది. దీంతో శ్రీను కేకలు వేయడంతో పక్క షెడ్డులో నిద్రిస్తున్న తండ్రి పోచయ్య ఇంట్లోకి వచ్చేసరికి స్వప్న పారిపోయింది. శ్రీను మెడపై రెండు, ఎడమ చెంపపై, చెవి కింది భాగంలో, ఎడమ రొమ్ముపై భాగంలో తీవ్రగాయాలై మృతి చెందాడు. బుధవారం విషయం తెలుసుకున్న రెబ్బెన సీఐ ఆకుల అశోక్, ఎస్సై రమేష్ సంఘటనా స్థలానికి చేసుకుని విచారణ చేపట్టారు. శ్రీను తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తల్లీదండ్రులు దూరం కావడంతో వారి పిల్లలు అనాథులుగా మారారు. కళ్ల ఎదుటే విగతజీవిగా పడిఉన్న తండ్రి మృతదేహం వద్ద చిన్నా రుల రోదన స్థానికులను కంటతడి పెట్టించాయి.
Comments
Please login to add a commentAdd a comment