సాక్షి, హైదరాబాద్: పట్టపగలే ఓ ప్రేమోన్మాది యువతిని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. బంగారు నగలు కట్ చేసే కట్టర్‌తో దాడికి తెగబడి ప్రాణాలు తీశాడు. సోమవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతడు ఓ పోలీసు అధికారి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు.
అగ్గిరాముడు మధురానగర్‌లో ఇస్త్రీ షాపు నిర్వహించడంతోపాటు ఓ ఇంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ జవహర్ నగర్‌లో కుటుంబంతో సహా అద్దెకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె వెంకటలక్ష్మి (19) ఏడో తరగతి వరకు చదివింది. కొన్నాళ్లు ఇళ్లల్లో పని చేసింది. రెండు నెలల నుంచి జవహర్ నగర్‌లోని జోడి ఫ్యాషన్ జ్యువెలరీస్ వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్స్‌లో పని చేస్తోంది. ఈ షాపు యజమాని జ్యోత్స్న నాలుగు రోజుల క్రితం వేరే ఊరికి వెళ్లడంతో వెంకటలక్ష్మి దుకాణం నిర్వహిస్తోంది. సోమవారం కూడా స్టోర్స్ తెరిచిన వెంకటలక్ష్మి మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో యజమానురాలికి ఫోన్ చేసింది.
షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, తనను వేధిస్తున్నారని చెప్పింది. తర్వాత 3.30 గంటల సమయంలో ఓ యువకుడు షాప్‌లోకి వచ్చాడు. అక్కడే ఉన్న బంగారు నగలు కట్ చేసే కట్టర్‌తో వెంకటలక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడున్న వెంకటలక్ష్మిని స్థానికులు కొద్దిసేపటి తర్వాత గమనించారు. వీరి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఆరు నెలల నుంచి వేధింపులు
ఆరు నెలలుగా సాగర్ అనే యువకుడు తనను వేధిస్తున్నట్లు వెంకటలక్ష్మి తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఓసారి సాగర్ ఇలానే చేసినట్లు ఆమె పలువురి వద్ద వాపోయినట్లు తెలిసింది. ప్రేమను నిరాకరించిన కారణంగానే అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగానే కుట్ర పన్ని సాగర్ గత నాలుగైదు రోజులుగా ఆమెను వెంటాడుతూ, ప్రతి కదలికను గుర్తించినట్లు తెలిసింది.
దుకాణంలో ఒంటరిగా ఉందని, మధ్యాహ్నం వేళల్లో వినియోగదారుల రద్దీ కూడా ఉండదన్న ఉద్దేశంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ హత్యలో సాగర్‌కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారు బయట కాపు కాయగా.. దుకాణంలోకి వెళ్లిన సాగర్ ఘాతుకానికి తెగబడినట్లు సమాచారం. గొంతు కోసిన తర్వాత సాగర్ ఆమె మెడలో ఉన్న చున్నీతో ఉరి వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు మధురానగర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. గతంలోనూ అతడు తమ కూతురిని బెదిరించాడని వెంకటలక్ష్మి కుటుంబీకులు తెలిపారు.
రోదిస్తున్న వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం
అన్ని కోణాలను పరిగణలోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నాం. స్థానికుల సమాచారంతోపాటు ఘటనా స్థలంలో ఉన్న సీసీఫుటేజీలు, వీధిలోని ఫుటేజీలను సేకరించి విశ్లేషిస్తున్నాం. బాధితురాలి సెల్‌ఫోన్ కాల్‌డేటా సైతం పరిశీలిస్తున్నాం.
– ఏఆర్ శ్రీనివాస్, వెస్ట్‌జోన్ డీసీపీ
Comments
Please login to add a commentAdd a comment