
సాక్షి, కాన్పూర్ : పదేపదే వెంబడించి వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు యువకుల ఆగడాలు శ్రుతిమించడంతో కాన్పూర్‌కు సమీపంలోని చిత్వకేదా గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలోని ఓ చెట్టుకు ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది. తన శరీరంపై నిందితుల పేర్లతో కూడిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. మరణించిన యువతిని గ్రామానికి చెందిన నేహ కుష్వాహగా గుర్తించామని, సూసైడ్ నోట్ ఆధారంగా విచారణకు ఆదేశించామని ఎస్‌పీ రతన్‌కాంత్ పాండే తెలిపారు.
బాధిత యువతిని సమీప గ్రామానికి చెందిన సంజయ్ కోరి అతని సోదరుడు సోను గత కొద్ది రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. నిందితులకు మరణ శిక్ష విధించాలని ఆమె సూసైడ్ నోట్‌లో డిమాండ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌పీ తెలిపారు.