రాజేంద్ర, కుమారి (ఫైల్)
విశాఖపట్నం, ఆనందపురం(భీమిలి): ప్రజలు మాన ప్రాణాల ను కాపాడడంతో పాటు దేశ రక్షణ చేపట్టవలసిన పోలీసు అతను. కానీ అతనిలో ఎక్కడో మానవ మృగం దాగి ఉంది. దీంతో తన విద్యుద్ధర్మాన్ని మరచి సహచర ఉద్యోగిని ప్రేమ పేరుతో ఉచ్చులోకి లాగాడు. శారీకంగా అనుభవించాడు. పెళ్లి విషయం ఎత్తేసరికి తప్పించుకో చూశాడు. కానీ ఆమె ఎదురు తిరగడంతో తప్పనిసరి పరిస్థితిలో వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని పన్నాగం పన్నాడు. ఆమెను నిత్యం శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో బంగారుమయం అవుతుందనుకున్న జీవితం చుక్కాని లేని నావ కావడం, అయిన వారికి కూడా దూరం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఆనందపురంలో బుధవారం జరిగిన విషాధ సంఘటన ఇది. స్థానిక సీఐ సూర్యనారాయణ, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
ప్రేమగా మారిన పరిచయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, పూడూరు మండలం, వెంకాపల్లి గ్రామానికి చెందిన మాల రాజేంద్ర (27)కు రెండేళ్లు క్రితం ఇండో టిబెటిన్ బోర్డర్ బెటాలియన్ (ఐటీబీపీ)లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఈ మేరకు మండలంలోని పందలపాకలో ఉన్న బెటాలియన్‌లో చేరిన రాజేంద్ర అప్పటి నుంచి అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా విశాఖ జిల్లాలోని మునగపాక మండలం, నాగవరం గ్రామానికి చెందిన కరణం కళావతి, రమణ దంపతుల చిన్న కుమార్తె కరణం కుమారి(22) డిగ్రీ వరకూ చదువుకోగా 2017 మే 1న ఐటీబీపీలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ మేరకు పందలపాకలో ఉన్ని బెటాలియన్‌లో చేరింది. అక్కడ కుమారికి రాజేంద్ర ఉద్యోగ రీత్యా పరిచయమయ్యాడు. ఇద్దరూ తెలుగు వారు కావడంతో చనువు పెరిగి ప్రేమకు దారి తీసింది. అయితే వీరివి వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.
సంఘటన స్థలం వద్ద కుమారి మృతదేహం పరిశీలిస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్, ఐటీబీపీ అధికారులు
దీంతో కుమారి తనకు రక్షణ కావాలంటూ పట్టుబట్టడంతో నాలుగు నెలలు క్రితం సింహాచలంలో రాజేంద్ర వివాహం చేసుకున్నాడు. అనంతరం వారు ఆనందపురంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. కానీ వారిరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో రెండు నెలలు క్రితం కుమారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స చేయించడంతో కోలుకుంది. ఈ విషయమై బెటాలియన్ అధికారులు వారిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి సర్ది చెప్పారు. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతుండగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు.
తీవ్ర మనస్తాపానికి గురై...
ఇదిలా ఉండగా రాజేంద్ర శిక్షణ నిమిత్తం ఈ నెల 7న చంఢీఘర్ వెళ్లాడు. ఏమైందో తెలియదు కానీ కుమారి మంగళవారం ముందుగా రాజేంద్రకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నానని తెలిపినట్టు తెలిసింది. అయితే అటు నుంచి ఓదార్పు రాలేదు సరికదా నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతానని చెప్పి రాజేంద్ర ఫోన్ పెట్టేసినట్టు పోలీస్ విచారణలో బయట పడింది. దీంతో ఇంకా మనస్తాపానికి గురైన కుమారి తన తల్లిదండ్రులైన కళావతి, రమణలకు ఫోన్ చేసి నేను జీవితంలో మోసపోయానని, చనిపోతున్నానని చెప్పింది. దీంతో ఎలాంటి అఘాయిత్యానికీ పాల్పడవద్దని తాము వస్తున్నామని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండగానే... కుమారి ఫోన్ పెట్టేసింది. ఆమె నివాసం ఉంటున్న ఇంట్లో ఫ్యాన్ హుక్కుకు చీరతో ఉరి వేసుకుంది.
ఈ విషయం బుధవారం ఉదయం బయట పడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఈస్ట్ ఏసీపీ పూర్ణ చంద్రరావు, సీఐ సూర్యారావు, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. కుమారి సెల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకొని అందులో ఉన్న ఫోన్ కాల్స్, ఇతర సమాచారాన్ని క్రోడీకరించి సేకరించారు. ఈ మేరకు అందులో ఉన్న ఫోన్ నంబరు ఆధారంగా రాజేంద్రకు ఫోన్ చేయగా తనకు ఏమీ తెలియదని తప్పించుకో చూశాడు. కానీ చంఢీఘర్ పోలీసులు అతడిని అక్కడ పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించడానికి నిర్ణయించారు. ఐటీబీపీ కమాండెంట్ చంద్రమోహన్ మిశ్రా, ఎస్‌ఐ బాల నాయక్‌లు కూడా సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి తహసీల్దారు మల్లా అప్పలరాజు ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసుని సీఐ సూర్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment