సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, (ఇన్‌సెట్‌లో) మృతురాలు లక్ష్మీత్రివేణి
నాదెండ్ల (చిలకలూరిపేట): సమయం రాత్రి రెండు గంటలు దాటింది.. రెండు పోర్షన్ల ఇంటిలో పది మంది నిద్రిస్తున్నారు.. ఇంతలో జాతీయ రహదారిపై ప్రయాణం చేయాల్సిన లారీ అదుపుతప్పి రెయిలింగ్‌ను దాటుకుని సర్వీస్ రోడ్డుపక్కన ఉన్న ఇంటిపైకి మృత్యుశకటంలా దూసుకొచ్చింది. ఇంటిని, ఆనుకుని ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగింది. అయితే ఇంటిగోడ కూలిపడటంతో ఓ యువతి మృతిచెందగా, ఆమె తల్లి, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన నాదెండ్ల మండలం, గణపవరం గ్రామం వద్ద సోమవారం రాత్రి (మంగళవారం తెల్లవారుజాము)న జరిగింది. ఎస్‌ఐ కె.చంద్రశేఖర్ కథనం మేరకు.. ఏపీ 07 టీఎన్ 0748 నంబరు లారీ గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తోంది.
గణపవరం వద్దకు వచ్చే సరికి డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో లారీ అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న రెయిలింగ్‌ను ఢీకొని సర్వీసు రోడ్డును దాటి కిషోర్ గ్రానైట్ క్వారీలో ఉన్నఓ ఇంటిలోకి దూసుకెళ్లింది. అయితే అక్కడ ఉన్న చెట్టు అడ్డురావటంతో నిలిచిపోయింది. లారీ ఢీకొట్టడంతో ఇంటి గోడ ఒకవైపు కూలి నిద్రిస్తున్న తల్లి రమణమ్మ, ఆమె కుమార్తె లక్ష్మీత్రివేణిపై పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మీత్రివేణి తీవ్రంగా, రమణమ్మ, ఆమె తల్లి భూలక్ష్మి, రెండో పోర్షన్‌లో నివసిస్తున్న శ్రీకాంత్ గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది లక్ష్మీత్రివేణి, రమణమ్మను 108 హుటాహుటిన గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమించి లక్ష్మీత్రివేణి (19) మృతి చెందింది. ఎస్‌ఐ కె.చంద్రశేఖర్ ఘటనాస్థలానికి చేరుకుని ప్రొక్లెన్ సాయంతో లారీని బయటకు తీయించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ఓ గ్రానైట్ ఉద్యోగి వాహనం నుజ్జునుజ్జయింది. లారీ కావూరు సమీపంలోని ఓ రైస్‌మిల్లు యజమానిగా గుర్తించారు. లారీడ్రైవర్ పరారయ్యాడు.
క్వారీలో విషాదఛాయలు
రమణమ్మ భర్త కొద్ది కాలం క్రితం మృతి చెందాడు. దీంతో రమణమ్మ తన కుమార్తె లక్ష్మీత్రివేణి, తల్లి భూలక్ష్మితో కలిసి నివసిస్తోంది. లక్ష్మీత్రివేణి ఇంటర్ మొదటి సంవత్సరం వరకూ చదివి ఆ తరువాత స్పిన్నింగ్ మిల్లు పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా ఉంటోంది. రాత్రి పది గంటల సమయంలో అందరం కలిసి భోజనం చేసి నిద్రపోయామని, అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో లారీ దూసుకొచ్చిందని భూలక్ష్మి తెలిపారు. లక్ష్మీత్రివేణి మృతదేహాన్ని జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు గణపవరం తరలిం చారు. కుటుంబ సభ్యుల రోదనలతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చెట్టే వాళ్ల ప్రాణాలు కాపాడింది
రెండు పోర్షన్ల ఇంటిలో లక్ష్మీత్రివేణి, ఆమె తల్లి, అమ్మమ్మ, మరో పోర్షన్‌లో స్పిన్నింగ్ మిల్లు కార్మికులు ఏడుకొండలు, అరుణ, పిచ్చమ్మ, శ్రీకాంత్, కార్తీక్, రమేష్, అనూష నివసిస్తున్నారు. లారీ ఢీకొన్న సమయంలో చెట్టు అడ్డురావడంతో రెండో పోర్షున్‌లో నివసిస్తున్న ఏడుగురు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడగా, శ్రీకాంత్
స్వల్పంగా గాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment