సాక్షి, నాగర్‌కర్నూల్: సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య స్వాతిని అరెస్టు చేశారు. ‘మనసు మమత’టీవీ సీరియల్ ప్రభావంతో ఈ హత్యకు పథక రచన చేసినట్లు నిందితురాలు స్వాతి వెల్లడించినట్లు నాగర్‌కర్నూల్ ఏఎస్పీ జోగుల చెన్నయ్య చెప్పారు. ఆదివారం డీఎస్పీ లక్ష్మీనారాయణ, కొల్లాపూర్ సీఐ శ్రీనివాసరావుతో కలసి ఆయన కేసు వివరాలను మీడియాకు వివరించారు.
ప్రియుడితో కలసి హత్య
ప్రియుడు రాజేశ్‌తో ఉన్న వివాహేతర సంబంధంపై గత నెల 26న భర్త సుధాకర్‌రెడ్డి నిలదీశాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇద్దరూ తోసుకోవడంతో సుధాకర్‌రెడ్డి తలకు గాయమైంది. అదేరోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో సుధాకర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లి తలకు కుట్లు వేయించుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే రాజేశ్‌తో కలసి సుధాకర్‌రెడ్డిని హత్య చేసేందుకు స్వాతి పథకం రచించింది. ఆ రోజు రాత్రే పని ముగించాలని అనుకున్నప్పటికీ ఇంట్లో మరో వ్యక్తి ఉండటంతో కుదరలేదు.
తెల్లవారుజామున అతను బయటకు వెళ్లిన వెంటనే రాజేశ్‌ను ఇంటికి పిలిపించుకున్న స్వాతి.. నిద్రిస్తున్న సుధాకర్‌రెడ్డి మెడకు మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. నోట్లో అతను అరవకుండా బట్టలు కుక్కింది. ఆ తర్వాత ప్రియుడితో కలసి ఇనుప రాడ్‌తో సుధాకర్‌రెడ్డి తలపై బాదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే శవాన్ని దుప్పట్లో మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని నవాబ్‌పేట మండలం ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. రోడ్డుకు వంద మీటర్ల దూరం అడవిలో శవాన్ని పడేసి.. వెంట తీసుకెళ్లిన పెట్రోల్‌తో తగులబెట్టారు.
అనంతరం అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. తాము తీసుకెళ్లిన వాహనాన్ని మెకానిక్ షెడ్‌లో సర్వీసింగ్ చేయాలంటూ ఇచ్చేశారు. ప్రియుడు రాజేశ్, స్వాతిలను అదుపులోకి తీసుకొని విచారించగా.. పథకం ప్రకారమే తాము సుధాకర్‌రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఘటన స్థలంలో కాలిన శవం, ఎముకలు, పుర్రె మాత్రమే లభించిందని, వీటిని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా రాజేశ్, ఏ2 నిందితురాలిగా స్వాతిని చేర్చినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment