సూసైడ్ నోట్
సాక్షి, బేతంచెర్ల(కర్నూలు) : కూతురు పెళ్లికి ఒప్పుకోవడంలేదనే మనస్తాపంతో తల్లి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలోని ముద్దవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి భార్య రమణమ్మ(46) రెండవ అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె భాగ్యలక్ష్మికి వివాహం కాగా, చిన్న కుమార్తె భార్గవికి ఇటివలే రహిమానుపురం గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి కుదిరింది. అయితే తనకు ఈ సంబంధం ఇష్టం లేదని కూతురు చెప్పడంతో మాట ఇచ్చామని, ఎలాగైనా వివాహం చేసుకోవాలని కోరింది.
అయినా వినకపోవడంతో ఆదివారం ఉదయం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో కూతురు అంగన్‌వాడీ కేంద్రం వద్దకు వచ్చి చూడగా తల్లి ఉరి వేలాడుతుండటంతో గుండెలు బాదుకుంది. మృతురాలి చేతిలో ఉన్న సూసైడ్‌నోట్‌లో ‘అయామ్ స్వారీ భార్గవీ, నీకు ఇష్టం లేనిపని ఏమి నేను చెయ్య లేను. అలాగని చేయిదాటిపోయినందుకు నాకు నేనే బాధపడుతున్నాను. నీకు మంచి తల్లిని కాలేక పోయా, సో అయామ్ సారీ, నాకు ఇక ఏమార్గం కన్పించలేదు’ అని రాసి సంతకం చేసి ఉంది. వీఆర్వో వెంకట్‌రావు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment