బనశంకరి : కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 8 లక్షలు తీసుకుని ఓ మహిళా టెక్కీ ఉడాయించిన సంఘటన బసవేశ్వరనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహిళా టెక్కీ స్మృతిఖానాపూర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు...నగరంలోని స్టాఫ్‌హౌసింగ్ కాలనీకి చెందిన శంకర్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఇక్కడి శంకర్ డైయిరీ సర్కిల్ వద్ద గల ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మూడు నెలల క్రితం ఎలక్ట్రికల్ పనులు చేశాడు. ఈ సమయంలో శంకర్‌కు అదే కంపెనీలో పనిచేసే ముంబయికు చెందిన స్మృతిఖానాపూర్ అనే యువతి పరిచయమైంది. కంపెనీలో రూ. కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఇప్పిస్తానని ఇందుకు రూ. 15 లక్షలు కమీషన్ ఇవ్వాలని అడిగింది. దీంతో ఆమె మాటలను నమ్మిన శంకర్ ఫిబ్రవరి 14న రూ. 5 లక్షలు అందజేశాడు.
అప్పటి నంచి స్మృతిఖానాపూర్ అదృశ్యమైంది. ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో బాధితుడు శంకర్ బసవేశ్వరనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదే విధంగా నగరంలోని మంజునాథ్ నగర్‌కు చెందిన మరో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ రవికుమార్‌ను ఇలాగే మోసం చేసి నాలుగు నెలల క్రితం రూ. 12 లక్షల కమీషన్ అడిగింది. ఆమె మాటలను నమ్మిన రవికుమార్ మొదటి విడతగా రూ. 3 లక్షలు అందజేశాడు. అప్పటి నుంచి స్మృతిఖానాపూర్ కనిపించడం లేదు. దీంతో బాధితుడు ఆమెపై బసవేశ్వరనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కిలాడి లేడీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment