
సాక్షి, పీలేరు: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన మరిదిని ప్రియుడితో కలసి వదిన హతమార్చింది. శుక్రవారం చిత్తూరు జిల్లా పీలేరు మండలం తలపులలో ఈ దుర్ఘటన జరిగింది. పీలేరు ఎస్‌ఐ పీ.వీ. సుధాకర్‌రెడ్డి కథనం మేరకు తలపులకు చెందిన కోళ్ల బాషాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మస్తాన్ టైలర్‌గా, మరో కుమారుడు కోళ్ల యాసిన్ పీలేరులో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్. ఇద్దరూ తలపులలో కాపురం ఉంటున్నారు. మస్తాన్ భార్య దిల్‌షాద్ ఇదే గ్రామానికి చెందిన యోగేంద్రనాయుడుతో వివాహేతర సంబందం పెట్టుకుంది.
శుక్రవారం సాయంత్రం వారిద్దరూ కలసి ఉండటాన్ని యాసిన్ గుర్తించి ప్రశ్నించారు. దీంతో వారు తమ అక్రమ కార్యకలాపాల గుట్టు రట్టవుతుందని భావించి యాసిన్(37)ను హతమార్చారు. కళ్లు తిరిగి పడిపోయాడని నమ్మబలికి ఇంటి వద్ద మంచంపై పడుకోబెట్టారు. డాక్టర్‌ను పిలిపించి చూపించారు. పల్స్ దొరకలేదని, వెంటనే పీలేరుకు తీసుకెళ్లమని డాక్టర్ సూచించారు. దీంతో పీలేరుకు తీసుకొచ్చారు. అప్పటికే చనిపోయాడని ధ్రువీకరించడంతో మృతదేహాన్ని తలపులకు తరలించారు. పోలీసులు దిల్‌షాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు యోగేంద్రనాయుడు పరారయ్యాడు. మృతుడికి భార్య సుబహాని, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment