
ఆంజనేయులు శవాన్ని తగులబెట్టిన ప్రదేశం, (ఇన్‌సెట్‌లో) ఆంజనేయులు ఫైల్‌ఫొటో
సాక్షి, హైదరాబాద్ : శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మహిళను చేతబడి చేసి చంపాడంటూ ఓ యువకుడ్ని కొట్టిచంపారు ఆమె కుటుంబసభ్యులు. అనంతరం మహిళ చితిపైనే యువకుడ్ని శవాన్ని దహనం చేశారు. ఈ సంఘటన శామీర్‌పేట మండలంలోని అద్రాస్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అద్రాస్‌పల్లికి చెందిన గ్యార లక్ష్మి అనే మహిళ గత కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అదే గ్రామానికి చెందిన బోయిన ఆంజనేయులు అనే యువకుడు చేతబడి చేయటం వల్లే ఆమె అనారోగ్యం పాలైందని ఆమె బంధువులు భావించారు. ఈ నేపథ్యంలో బుధవారం లక్ష్మి మరణించింది. కుటుంబసభ్యులు ఆ రోజు సాయంత్రం ఆమెకు దహనసంస్కారాలు నిర్వహించారు.
ఆంజనేయులుపై అనుమానంగా ఉన్న కుటుంబసభ్యులు అతడు స్మశానం దగ్గరకు వస్తాడని భావించారు. అయితే యాదృచ్ఛికంగా అతడు అక్కడి వచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన వారు ఆంజనేయులును విచక్షణా రహితంగా కొట్టి చంపారు. అనంతరం లక్ష్మిని దహనం చేసిన చోటే అతడి శవంపై కట్టెలు పేర్చి దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment