న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌లో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేసినందుకు తండ్రి మందలించటంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన న్యూఢిల్లీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సౌత్ ఢిల్లీలోని వసంత్ విహార్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడు కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్‌లో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేశాడు. ఈ విషయం తండ్రికి తెలిసి అతన్ని మందలించాడు. చదువుపై దృష్టి పెట్టాలని కోప్పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన అతడు బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఉరితాడుకు వేళాడుతున్న కుమారుడ్ని గుర్తించిన తల్లిదండ్రులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి తీసుకురావటానికి ముందే యువకుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై డీసీపీ దేవేందర్ ఆర్య మాట్లాడుతూ.. ‘‘యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం సఫ్ధర్‌జంగ్ ఆసుపత్రికి తరలించాము. తండ్రి మందలించటం కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని నిజానిజాలు ఇంకా తెలియాల్సివుంది. అన్ని కోణాలనుంచి కేసును దర్యాప్తు చేస్తున్నామ’ని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment