
నెల్లూరు (క్రైమ్): ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి ఉరివేసుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఆత్మహత్య ఘటన వెనుక గల కారణాలు శనివారం ఈ సెల్ఫీ వీడియోతో వెలుగుచూశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
► జిల్లా కేంద్రంలోని భక్తవత్సలనగర్‌లో నివాసం ఉంటున్న వెంకటరాజు కుమార్తె రమ్య (21) నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది.
► శుక్రవారం రమ్య కుటుంబసభ్యులతో కలిసి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. భోజనం చేసి వస్తానని చెప్పి మధ్యాహ్నం రమ్య తిరిగి ఇంటికి వచ్చేసింది. అనంతరం ఫ్యానుకు ఉరి వేసుకుంది.
► యువతి ఆత్మహత్యకు కారణాలేమీ లేవని కుటుంబీకులు చెప్పడంతో వేదాయపాళెం పోలీసులు సెక్షన్ 174 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేశారు. రమ్య కుటుంబీకులు అదే రోజు రాత్రి రమ్య ఫోన్‌ను పరిశీలించగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటూ తీసిన డెత్ సెల్ఫీ వీడియో, సెల్ఫీలు, శివభార్గవ్‌కు పంపిన మెసేజ్‌లు బయటపడ్డాయి. దీంతో వారు అసలు విషయంపై ఆరా తీయగా రమ్య, శివభార్గవ్‌ల ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
► రమ్య పెళ్లి చేసుకోమని అడగగా అతను నిరాకరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసులోని సెక్షన్లు మార్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు.