పారిపోయిన ప్రవాసీలపై కక్షసాధిస్తున్న 'కఫీల్లు'
హైదరాబాద్:
నాలుగు నెలల క్రితం సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించిన క్షమాబిక్ష (ఆమ్నెస్టీ) పథకం జులై 25తో ముగియనుంది. నివాస, కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడి సౌదీలో అక్రమమంగా నివసిస్తున్న విదేశీయులు ఎలాంటి జరిమానాలు, జైలుశిక్షలు లేకుండా తమతమ దేశాలకు తిరిగి వెళ్లడానికి ఈ పథకం వెసులుబాటు కల్పించింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు వెయ్యిమంది వలసకార్మికులపై 'మత్లూబ్' (పోలీసు కేసు) ఉన్నందున ‘అమ్నెస్టీ’ని వినియోగించుకోలేక పోతున్నారు.
వీరిలో చాలామంది ఎడారిలో ఒంటెలు, గొర్రెల కాపరులుగా, ఇంటి డ్రైవర్లుగా, భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. సరైన భోజనం, వసతి లేకపోవడం, వేతనాలు చెల్లించకపోవడం, యజమానుల అమానవీయ ప్రవర్తన తట్టుకోలేక వీరు యజమానుల నుండి పారిపోయారు.
సౌదీలో చిక్కుకుపోయిన తమను రక్షించి స్వదేశానికి తీసుకురావాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తెలంగాణ మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవితలను కోరుతూ 35 మంది తెలంగాణకు చెందిన వలసకార్మికులు ఆదివారం ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన చల్ల సుదర్శన్ మాట్లాడుతూ తమకు పనిలేదని, ఉండటానికి, తినడానికి డబ్బులు లేవని తమను ఎలాగైనా రక్షించి ఇండియాకు పంపాలని వేడుకున్నారు.
'హురూబ్'.. 'మత్లూబ్'
సౌదీ అరేబియాలో 'కఫీల్' (స్పాన్సర్ / యజమాని) కి తెలుపకుండా ప్రవాసి ఉద్యోగి పనికి గైరుహాజరు కావడం, పారిపోవడాన్ని అరబ్బీలో 'హురూబ్' (పారిపోయిన ప్రవాసి ఉద్యోగి) అంటారు. సౌదీ చట్టాల ప్రకారం ఉద్యోగి పారిపోయిన సందర్భాలలో యజమాని 'జవజత్' (పాస్ పోర్ట్, ఇమ్మిగ్రేషన్ శాఖ) అధికారులకు ఫిర్యాదు చేస్తే ప్రవాసి ఉద్యోగిని 'హురూబ్' గా ప్రకటిస్తారు. కొందరు యజమానులు పారిపోయిన ఉద్యోగులపై దొంగతనం, ఆస్తి నష్టం లాంటి 'మత్లూబ్' (పోలీసు కేసు) నమోదు చేస్తుంటారు. దురుద్దేశం కలిగిన కొందరు 'కఫీల్లు' పారిపోయిన ఉద్యోగులను పీడించడానికి 'మత్లూబ్' వ్యవస్థను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు.
Dear @balkasumantrs sir @SushmaSwaraj mam we r stuck in saudi, bcoz of sponsors kepts us false cases.pls save us n bring back to india. pic.twitter.com/jh0PZnyyog
— Madhusudhan dasari (@Madhusudhanda13) 23 July 2017