వికటించిన నిశ్చితార్థ భోజనం.. 120 మందికి అస్వస్థత
కుప్పం రూరల్(చిత్తూరు జిల్లా): నిశ్చితార్థంలో పెట్టిన భోజనం వికటించడంతో 120 మంది ఆస్పత్రి పాలైన సంఘటన చిత్తూరు జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కుప్పం మండలం, వేపూరు గ్రామానికి చెందిన గంగప్ప కుమారుడు మణికి, ఉర్లవోబనపల్లి గ్రామానికి చెందిన మల్లప్ప కుమార్తె సిద్దమ్మలకు సోమవారం మధ్యాహ్నం ఉర్లవోబనపల్లిలో నిశ్చితార్థం నిర్వహించారు. 90 మంది వేపూరు గ్రామస్తులు, 70మంది పెళ్లికుమార్తె తరఫువారు ఇందులో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం కొంచెం ఆలస్యమైంది. ఉదయం 10 గంటలకే వండి పెట్టుకున్న భోజన 2 గంటలకు బంధువులకు వడ్డించారు. అందరూ 4 గంటల వరకు ఉర్లవోబనపల్లిలోనే ఉన్నారు. 5 గంటల సమయంలో ఇద్దరు పిల్లలకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. ఎండ వేడిమికి అయి ఉండవచ్చని ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు.
అయితే వేపూరు చేరుకున్న పెళ్లి కుమారుని బంధువులకు రాత్రి 7 గంటల నుంచి ఒక్కొక్కరికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. పెళ్లి కుమార్తె బంధువులకూ ఇదే పరిస్థితి. రెండు గ్రామాలకు చెందిన మొత్తం 120 మంది అస్వస్థులయ్యారు. హుటాహుటిన 40 మందిని కుప్పం వందపడకల ఆస్పత్రికి, 30 మందిని బీఆర్‌డీ ఆస్పత్రికి, మరో 30 మందిని ప్రియానర్సింగ్ హోమ్‌కు తరలించారు. మరో 20 మంది మల్లానూరు, మిట్టపల్లి గ్రామాల్లోని పీఎంపీ వైద్యుల వద్ద చికిత్స పొందుతున్నారు. వీరిలో 12 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఒకేసారి 120 మంది వ్యాధి బారిన పడటంతో సోమవారం రాత్రి కుప్పం పట్టణంలోని ఆస్పత్రుల క్షతగాత్రులు, బంధువులతో నిండిపోయాయి. సంఘటన విషయాన్ని తెలుసుకున్న సీ ఎం పీ ఏ మనోహర్ గ్రామానికి ఆంబులెన్సులు, ఇద్దరు వైద్యులను పంపి పరిస్థితిని సమీక్షించారు.