టీకాలు వేయించండి | 11 days to expire of galikuntu disease | Sakshi
Sakshi News home page

టీకాలు వేయించండి

Published Sun, Sep 18 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

టీకాలు వేయించండి

టీకాలు వేయించండి

– పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ రామచంద్ర
అనంతపురం అగ్రికల్చర్‌ : గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మరో 11 రోజులు గడువు పొడిగించినందున పశువులు, ఎద్దులకు టీకాలు వేయించుకోవాలని స్థానిక పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (అనిమల్‌ డిసీసెస్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌–ఏడీడీఎల్‌) సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎన్‌.రామచంద్ర తెలిపారు. గత నెల 20న ప్రారంభమైన ఫ్రూట్‌ అండ్‌ మౌత్‌ డిసీసెస్‌– ఎఫ్‌ఎండీ) టీకాల కార్యక్రమం 19న (నేడు) ముగియాల్సివుండగా మరో 11 రోజులు అంటే నెలాఖరు వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇంకా పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించని రైతులు ఎక్కడికక్కడ పశువైద్యులు, ఇతర పారావెటర్నరీ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. వ్యాధి వ్యాపించిన తర్వాత చికిత్స చేయించడం కన్నా ముందస్తు చర్యలతో సమర్థంగా నివారించుకోవచ్చని తెలిపారు.

గాలికుంటు లక్షణాలు
వైరస్‌ వల్ల సోకే అంటువ్యాధి కావడంతో మరణాలు తక్కువైనా ఆవులు, గేదెల్లో పాల ఉత్పత్తులు తగ్గిపోవడం, ఎద్దులు బలహీనంగా తయారై పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగానూ, బలహీనంగా ఉండే యుక్తవయస్సు పశువుల్లో వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం ఉంటుంది. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడుతాయి. నోటిలోపల, నాలుక మీద, ముట్టె లోపల భాగంలో బొబ్బలు ఏర్పడుతాయి.

24 గంటల్లోగా చిక్కిపోయి అల్సర్‌కు గురవుతాయి. మేత మేయవు. చొంగ కారుస్తాయి. గిట్టల మధ్య పుండ్ల కారణంగా సరిగా నడవలేవు. గర్భంతో ఉన్న పశువులు ఆబార్షన్‌కు గురవుతాయి. ఒక్కోసారి పొదుగుపై కూడా బొబ్బలు రావడం వల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది. బ్యాక్టీరియా చేరి చీము వస్తుంది. చీము కారడం వల్ల ఇతరత్రా రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాగే చీముపై ఈగలు వాలి గుడ్లు పెట్టడం, వాటి నుంచి వచ్చిన లార్వాలు కండరాలకు చేరి మాంసాన్ని తినడం వల్ల పెద్ద పెద్ద గాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.  వ్యాధి సోకిన పశువుల పాలను తాగడం వల్ల దూడలు మరణిస్తాయి.  

ఇలా నివారించుకోవాలి
వ్యాధి సోకిన పశువులను పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో గిట్టలు, పుండ్లను శుభ్రం చేయాలి. బోరోగ్లిజరిన్‌ పూత పూయాలి. ఈగలు వాలకుండా వేపనూనె, నిమ్లెంట్, లారాజెంట్‌ లాంటి మందులు వాడాలి. పశువైద్యాధికారి సిఫారసు మేరకు యాంటీబయాటిక్‌ మందులు తాపించాలి. వ్యాధి సోకిన పశువులకు రోజూ 50 గ్రాములు అయొడైజ్డ్‌ ఉప్పు దాణాతో ఇస్తే కొంత ఉపశమనం. అలాగే 30 గ్రాములు ఎముకలపొడి పచ్చిమేతతో కలిసి రోజూ ఇస్తే త్వరగా కోలుకుంటాయి. పశుశాఖ ద్వారా ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement