
రూ.110కోట్ల పన్నుల వసూలు లక్ష్యం
♦ మార్చి నెలాఖరు వరకు స్పెషల్‌డ్రైవ్
♦ జిల్లా పంచాయతీ అధికారి అరుణ
శంషాబాద్ రూరల్ : జిల్లాలో రూ.110 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) అరుణ తెలిపారు. మండలంలో పన్ను వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లతో ఆమె గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల చివరి వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లక్ష్యం మేరకు వసూళ్లు అయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో సుమారు రూ.166కోట్ల ఆస్తిపన్ను డిమాండ్ ఉండగా.. రూ.110కోట్ల వసూళ్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు రూ.87కోట్లు ఆస్తిపన్ను వసూలు అయిందని, గత ఏడాది 104కోట్ల రూపాయలు వసూలు అయ్యాయని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.
పంచాయతీల్లో కంప్యూటరీకరణకు చర్యలు తీసుకుంటామని, దీంతో పారదర్శకంగా పాలన అందించే అవకాశం ఉంటుందన్నారు. విద్యా సంస్థల నుంచి రావాల్సిన పన్ను బకాయిలను వసూలు చేయడానికి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు రోజువారి పన్ను వసూళ్ల వివరాలను తన సెల్‌కు మెసేజ్ ద్వారా పంపించాలని ఆదేశిం చారు. అంతకుముందు ఆమె ముచ్చింతల్ పంచాయతీలోని ‘జీవా’ ప్రాంగణాన్ని సందర్శించారు. జీవా ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ నిర్మించిన కట్టడాలకు పన్ను నుంచి మినహాయించాలని వచ్చిన అభ్యర్థన మేరకు డీపీఓ అరుణ భవన నిర్మాణాలను పరిశీ లించినట్లు సమాచారం.