రూ. 300 టికెట్ల భక్తులకు 12 లడ్డూలు
టీటీడీ సంక్రాంతి కానుకగా నేటి నుంచి అమలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే రూ.300 టికెట్ల భక్తులకు టీటీడీ సంక్రాంతి కానుక ఇచ్చింది. ప్రస్తుతం ఇంటెర్నెట్ ఆన్‌లైన్ పద్ధతిలో ఒకరు రూ.300 టికెట్టు కొనుగోలు చేస్తే రెండు లడ్డూలు ఉచితంగానూ, అదనంగా రూ.50 చెల్లిస్తే మరో రెండు లడ్డూలు ఇస్తారు. అయితే, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు భక్తులు తమ ఆరుగురి పేర్లతో రూ.1,800 చెల్లించి ఒక టికెట్టు పొందితే 12 లడ్డూలు ఉచితంగానూ, అదనంగా మరో రూ.150 చెల్లిస్తే మరో 6 లడ్డూలు అదనంగా ఇస్తారు. దీనివల్ల లడ్డూల కోసం ఇబ్బంది పడుతున్నట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావుకు ఫిర్యాదులు అందాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆరుగురు టికెట్టు పొందే సమయంలోనే లడ్డూల కోసం అదనంగా రూ.300 నగదు చెల్లిస్తే 12 లడ్డూలతో పాటు మరో 12 ఉచిత లడ్డూలు కూడా అందివ్వాలని గురువారం ఈవో ఉత్తర్వులిచ్చారు. సంక్రాంతి పర్వదినమైన శుక్రవారం నుంచి భక్తుల నోరు తీపి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టికెట్టు పొందే సమయంలోనే లడ్డూల కోసం రూ.300 చెల్లిస్తే అదనపు లడ్డూలు కూడా శుక్రవారం నుంచి పొందే అవకాశం కలి గింది. టీటీడీ ఈవో తీసుకున్న తాజా నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.