పలమనేరు(చిత్తూరు జిల్లా): అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా ట్రాక్టర్ ట్యాంకరులో ఉంచి 12 దుంగలను తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు.
దీంతో పాటు ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరో ఇద్దరు నిందితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, ట్రాక్టర్ విలువ సుమారు రూ. 10లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.