136 పాఠశాలలు మూత !
136 పాఠశాలలు మూత !
Published Sun, Jul 24 2016 8:22 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్‌అర్బన్ : విద్యాశాఖలోని రేషనలైజేషన్ ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. వచ్చేనెలలో రేషనలైజేషన్ చేపట్టనున్నారు. విద్యార్థులు ఉన్నచోట టీచర్లు లేకపోవడం.. టీచర్లు ఉన్నచోట విద్యార్థులు లేకపోవడం.. ఉపాధ్యాయుల గైర్హాజరు అంశాలపై సుప్రీంకోర్టు పాఠశాల విద్యాశాఖపై మండిపడింది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక కోరింది. ఈ క్రమంలో రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనల మేరకు వచ్చేనెలలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లాలో 1,475 ప్రాథమిక పాఠశాలలు, 432 ఉన్నత పాఠశాలలు, 268 యూపీఎస్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 2.10 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే పాఠశాలల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం పది మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసేయనున్నారు. అంతేగాక అసలే విద్యార్థులు లేని పాఠశాలలు ఏడు ఉన్నాయి. 10 మంది విద్యార్థుల్లోపు ప్రాథమిక పాఠశాలలు 80, యూపీఎస్‌లు 56 ఉన్నాయి. రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే ఈ పాఠశాలలు మూతపడనున్నాయి. కొంతకాలంగా యూపీఎస్ పాఠశాలల్లో (6, 7 తరగతులు) విద్యార్థులు లేని పాఠశాలల్లో కూడా టీచర్లు కొనసాగుతున్నారు. ఇందులో బోధన్ మండలం సాలూర, జాడి జమాల్‌పూర్, దోమకొండ మండలం లింగుపల్లి, మోర్తాడ్ మండలం గాండ్లపేట, కమ్మర్‌పల్లి మండలం బడితండా, కామారెడ్డి, బోధన్ మండలం హున్సా, జుక్కల్ మండలం బస్వాపూర్, నాగల్‌గావ్, కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి పాఠశాలలు ఉన్నాయి. అంతేగాక మాక్లూర్ మండలం గంగరమంద యూపీఎస్‌లో ఆరుగురు విద్యార్థులు, ఇదే మండలం వల్లభాపూర్ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు, కంఠేశ్వర్‌లోని యూపీఎస్‌లో ఆరుగురు, నిజామాబాద్ మండలం ముల్లంగిలో ముగ్గురు విద్యార్థుల చొప్పున కొనసాగుతున్నారు. ఎడపల్లి మండలం ఎన్‌సీ ఫారం, నవీపేట్ మండలం కమలాపూర్‌లో ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అత్యధికంగా జుక్కల్ మండలంలో ఏడు పాఠశాలలు, జక్రాన్‌పల్లి మండలంలో 10 యూపీఎస్‌లు 10లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. రేషనలైజేషన్ ప్రకారం వీటిని మూసేసే అవకాశం ఉంది. అంతేగాక ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి అత్యధికంగా ఉర్దూమీడియం పాఠశాలలు, 10 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు అధికంగా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో టీచర్లు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. దీని ప్రకారం జిల్లా వ్యాప్తంగా 136 పాఠశాలలు మూతపడనున్నాయి.
మార్పులు ఇలా ఉండొచ్చు...
రేషనలైజేషన్ ప్రక్రియలో 10 మందిలోపు ఉన్న పాఠశాలలను సమీప ప్రాంతంలోని 1 లేదా 2 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల్లో కలిపేస్తారు. టీచర్లను సైతం ఇదేమాదిరిగా కలిపేయడమా.. లేక పోస్టుతోసహా ఇతర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నచోట భర్తీ చేయడమో చేస్తారు. మరోఅంశం పదిమంది లోపు విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలను తమ సమీపంలోని కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో కలిపేస్తారు. యూపీఎస్ పాఠశాలల విషయానికొస్తే సంబంధిత పాఠశాల విద్యార్థులను అదేప్రాంతంలో సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు, గురుకుల, కస్తూర్బాగాంధీ విద్యాలయాలకు తరలించనున్నారు. సంబంధిత పాఠశాల టీచర్లను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి నివేదించి జిల్లాలో మిగతా పాఠశాలల్లో ఖాళీగా ఉన్నచోట నియమిస్తారు. అంతేగాక సమీపంలోని 2 కిలోమీటర్ల పరిధిలో పాఠశాల ఉంటే అక్కడకు విద్యార్థులు వెళ్లేందుకు రవాణాభత్యాలు చెల్లించాలని రేషనలైజేషన్ కమిటీ సిఫారసు చేసింది. కానీ ఈ అంశంపై ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో జీవోనెంబర్ 76 ప్రకారం జరిగిన రేషనలైజేషన్‌లో తక్కువగా ఉన్న పాఠశాలలను మూసేసి, టీచర్లను పోస్టులతో సహా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ విధానంలో కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూర్, చౌట్‌పల్లి, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్, పాలెంలో హైస్కూల్, యూపీఎస్ పాఠశాలలు ఒకే దగ్గర ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఇలా ఉండకూడదు. ప్రస్తుతం రేషనలైజేషన్ జరిగితే వీటి విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటారన్నది అధికారులు ఆలోచించాలి. ఒకవేళ యూపీఎస్ పాఠశాలను విద్యార్థులు తక్కువగా ఉండటంతో ఇతరప్రాంతాలకు తరలిస్తే విద్యార్థులను పక్కనే ఉన్న హైస్కూల్‌లో కలపడం అసాధ్యం. సమీపంలో ఉన్న పాఠశాలకు వెళ్లడమా.. లేదా అక్కడే కొనసాగించడమా అనేది ఆలోచించాల్సి ఉంటుంది.
ఆదేశాలు రాగానే..
జిల్లా విద్యాశాఖ అధికారి టి లింగయ్య,
రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. ప్రస్తుతం జీరో విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో సంబంధిత టీచర్లను అదేమండలంలో అవసరమున్న మరోచోటకు కేటాయించాము. రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి వివరాలతో సిద్ధంగా ఉన్నాం. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు ఎప్పుడు వస్తే అప్పుడు చేపడుతాం.
Advertisement
Advertisement