14 పశుచికిత్సా కేంద్రాల అప్‌గ్రేడ్
-పశువైద్యశాలలుగా మారుస్తూ ఉత్తర్వులు
– త్వరలో ఏడీ స్థాయి డాక్టర్ల నియామకం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఉన్న 14 పశుచికిత్సా కేంద్రాల (వెటర్నరీ డిస్పెన్సరీ–వీడీ)ను పశువైద్యశాలలు (వెటర్నరీ హాస్పిటల్స్–వీహెచ్)గా అప్‌గ్రేడ్ చేస్తూ పశుశాఖ డైరెక్టరేట్ నుంచి రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ అయినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. బుక్కరాయసముద్రం, రాప్తాడు, బత్తలపల్లి, యల్లనూరు, గోరంట్ల, అమరాపురం, పరిగి, తలుపుల, నల్లచెరువు, కనేకల్లు, శెట్టూరు, గుమ్మగట్ట, కొత్తచెరువు, లేపాక్షి పశువైద్య చికిత్సా కేంద్రాలు పశువైద్యశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. అక్కడ ఇప్పటి వరకు పశువైద్యాధికారులు పనిచేస్తుండగా ఇపుడు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి పశువైద్యాధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న పశువైద్యాధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు.
కొందరు ఏడీ స్థాయి అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించగా త్వరలోనే 14 ఆస్పత్రులకు రెగ్యులర్ ఏడీలను నియమించే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు ఎనిమిది గ్రామీణ పశువైద్య కేంద్రాల (రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్స్–ఆర్‌ఎల్‌యు)ను పశుచికిత్సా కేంద్రాలు (వీడీ)గా అప్‌గ్రేడ్ చేశారు. అందులో చియ్యేడు, పంపనూరు, నాగసముద్రం, కల్లూరు, చలివెందల, కె.బసవనపల్లి, సిద్ధగూరపల్లి, కె.బ్రాహ్మణపల్లి ఆర్‌ఎల్‌యూలు ఉన్నాయి.
ఇక్కడ ప్రస్తుతం కాంపౌండర్ స్థాయి అధికారులు పనిచేస్తుండగా వారి స్థానంలో పశువైద్యాధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ ఆ శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్‌ఠాగూర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బుక్కరాయసముద్రంలో పనిచేస్తున్న డాక్టర్ రామచంద్రారెడ్డిని చియ్యేడుకు, రాప్తాడులో పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాసులును పంపనూరుకు బదిలీ చేశారు. అలాగే బుక్కరాయసముద్రం ఆస్పత్రికి ఇన్‌చార్జ్ ఏడీగా శింగనమల ఏడీ డాక్టర్ స్వరూపారాణికి, అనంతపురం ఏడీ డాక్టర్ దేవరాజులును రాప్తాడు ఆస్పత్రికి ఇన్‌చార్జిగా నియమించారు.