
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
- ఈ నెల 20న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- వేదిక: ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల
– సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి ఘట్టమైన ఓట్ల లెక్కింపు ఈ నెల 20న నిర్వహిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ జేఎన్‌టీయూ సమీపంలోని ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను జిల్లాయంత్రాగం పూర్తి చేసింది. కౌంటింగ్ సిబ్బందికి శుక్రవారం పాలిటెక్నిక్ కళాశాలలో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం స్వయంగా శిక్షణ ఇచ్చి పలు సూచనలు చేశారు. వారి చేత మాక్ కౌంటింగ్ నిర్వహింపజేశారు. పారదర్శకంగా, కచ్చితంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 352 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపునకు 26 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి టేబుల్‌కు ఆరుగురు సిబ్బంది ఉంటారన్నారు. 20వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రాథమిక కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరిచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లలోకి తెచ్చి పోలింగ్ కేంద్రాల వారీగా టేబుళ్లకు అందజేస్తామన్నారు. సమగ్ర కౌంటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కోసం ప్రతి టేబుల్‌కు వెయ్యి బ్యాలెట్లు చొప్పున ఒక్కో రౌండ్‌కి 26 టేబుళ్లకు 26 వేల బ్యాలెట్ పేపర్లు ఇస్తారన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీకి పోలైన 1,55,536 ఓట్ల లెక్కింపు ఆరు రౌండ్లలో ముగుస్తుందన్నారు.
అభ్యంతర ఓట్లపై రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారన్నారు. బ్యాలెట్ పేపర్‌లో ఊదా రంగు స్కెచ్ పెన్‌తో 1 అంకె వేసిన ఓట్లు మాత్రమే చెల్లుతాయన్నారు. పదాల్లోనూ, రైట్, రాంగ్ గుర్తులు వేసినా ఓట్లు చెల్లవన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు 1, 1 అని ఇద్దరు అభ్యర్థులకు వేసి ఉన్నా తిరస్కరిస్తారన్నారు. ఒకే అభ్యర్థికి 1, 2, 3 ప్రాధాన్యతలతో వేసినా, వేలిముద్రలు, సంతకాలు చేసినా చెల్లవన్నారు. మొబైల్‌ఫోన్లు, నీటి గ్లాసులు, టీ కప్పులు, ఇతర ద్రావణాలు కౌంటింగ్ హాల్లోకి అనుమతించడవన్నారు. ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపులోనే ఇవే నిబంధనలు ఉంటాయన్నారు. అక్కడ 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు.
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ కోన శశిధర్ పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లను సందర్శించారు. ఆర్‌డీఓలు మలోలా, రామారావు, బాలానాయక్, తహశీల్దారు శ్రీనివాసులు, సూపరింటెండెంట్లు వరదరాజులు, హరి, డీటీ భాస్కర నారాయణ, తదితరులు పాల్గొన్నారు.