రాష్ట్రంలో 259 కోట్ల నిధులతో గురుకుల పాఠశాలల అభివృద్ధి
Published Sun, Sep 18 2016 9:23 PM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM
– మంత్రి పీతల సుజాత
చింతలపూడి: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం 259 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖామంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడిలో 80 లక్షల వ్యయంతో నిర్మించిన సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ నిధులతో గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగు పరిచి వసతి గృహాల్లో నివసిస్తున్న విద్యార్ధులను వాటిల్లోకి మార్పు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 17 వేల మంది పిల్లలను వసతి గృహాల నుండి గురుకులాల్లోకి మారుస్తున్నట్లు చెప్పారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండ పిల్లలకు సేవలు అందించాలని సూచించారు. వసతి గృహాల పిల్లలకు నాణ్యతతో ఆహారం అందించాలని ఆదేశించారు. 12 కోట్లతో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతిగృహాల నిర్మాణ పనులు నిలిచి పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంట్రాక్టర్‌కు 4 కోట్లు చెల్లించామని మిగిలిన నిధులను విడుదల చేయించడానికి సిఎం చంద్రబాబు దష్టికి తీసుకు వెళతానని చెప్పారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. వసతి గృహం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సోషల్ వెల్పేర్ డిప్యూటీ డైరెక్టర్ రంగలక్ష్మీ దేవి, జంగారెడ్డిగూడెం డీఎస్‌పి వెంకట్రావు, జెడ్‌పిటీసీ టి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, తహశీల్దార్ మైఖేల్‌రాజ్, ఎంపీడీఓ ఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement