త్వర‘బడి’తేనే ప్రగతి | smc development | Sakshi
Sakshi News home page

త్వర‘బడి’తేనే ప్రగతి

Published Fri, Aug 19 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

జలుమూరు బాలికోన్నత పాఠశాల

జలుమూరు బాలికోన్నత పాఠశాల

  • పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
  • స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలదే ‘గురు’తర బాధ్యత
  • పీడిస్తున్న నిధుల కొరత
  •  
    జలుమూరు: పాఠశాల అభివృద్ధిలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీలు)ల బాధ్యత కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన వివిధ నిధులు ఇక వీరి అనుమతిలేనిదే రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలుపడదు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కమిటీలు త్వరబడితేనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ఈ నేపథ్యంలో ఆయా సంఘాలు విధులు, బాధ్యతలపై ప్రత్యేక కథనం.
     
    కమిటీలకు శిక్షణ
     
    స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ఎన్నికలు పూర్తయిన సందర్భంగా కమిటీ సభ్యులు శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాకాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. విధులు చేపట్టిన పాఠశాల కమిటీలకు చెందిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సంఘ సభ్యులకు సంఘాల బాధ్యతలు, విధులు, ఇతరత్రా అంశాలపై తెలియజేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
     
    ప్రణాళిక సిద్ధం
     
    పాఠశాల అభివృద్ధికి స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. జిల్లా వ్యాప్తంగా 3,308 సంఘాలకు గాను 3,160పాఠశాలల్లో కొత్త సంఘాలు బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో పూర్తి స్థాయి మౌలిక వసతులు, భవనాలు, మరుగుదొడ్లు, ప్రహరీ లేనివి తదితర వాటిపై కమిటీలు దృష్టి పెట్టవలసి ఉంటుంది. 
     
    పనితీరుపై పర్యవేక్షణ
     
    ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయలపనితీరు, విద్యార్థుల ప్రగతిపై కమిటీలు తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాల్సిందే. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 14 వేల మంది ఉపాధ్యాయలు పనిచేస్తున్నారు. గత నెలలో రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవి చంద్ర తన దత్తత గ్రామమైన సైరిగాం అభివృద్ధిపై స్వయంగా  జలుమూరు మండల అధికారులుతో సమీక్షించి గ్రామంలో ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలలో చదవకూడదని, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలని సూచించారు. దీనికి కావలిన పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో మండల విద్యాశాఖధికారి గైర్హాజరయ్యారు. అలాగే మరుసటి రోజు ఉదయం  తనే స్వయంగా పాఠశాలకు వెళ్లి విద్యార్థుల చదువు,ప్రగతిపై అడిగేందుకు పాఠశాలకు వెళ్లగా అక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు సుమారు 25 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దీనిపై సంబంధిత విద్యాధికారులు వీరికి శాఖపరంగా మెమోలు ఇచ్చారు. అలాగే, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్‌ అధికారి బలివాడ దయానిది  ఎంత మంది ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటున్నారో తెలుసుకునేందుకు బస్‌లో రాకపోకలు చేస్తున్న ఉపాధ్యాయుల నివేదిక తయారు చేశారు.
     
    విధులు, బాధ్యతలు ఉన్నా నిధుల మాటేంటి
     
    విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ పాఠశాల సామాజిక భాగస్వామ్యం కింద ఎస్‌ఎంసీలదే బాధ్యత. ఏటా ప్రాథమిక పాఠశాలకు పదివేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.22 వేలు సదుపాయలు, నిర్వహణ కింద విడుదల చేస్తుంది. ఈ లెక్కన జిల్లాలో 2,269 ప్రాథమిక పాఠశాలలుకు రూ.226 కోట్లు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.12.51  కోట్లు విడుదలవుతాయి. ఈ నిధులు సద్వినియోగం అయ్యేలా కమిటీలు చూడాలి.  ఈ ఏడాది  కనీసం సుద్దముక్కలు కొనేందుకు  కూడా రూపాయి లేదని, మరి ఎలా అభివృద్ధి జరుగుతుందని ఆయా పాఠశాల కమిటీలు ప్రశ్నిస్తున్నారు. గతేడాది పాఠశాల నిర్వహణ నిధులు సుమారు రూ.12 కోట్లు ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఇప్పుడు కొత్తగా నిధులు వచ్చే పరిస్థితి కనబడం లేదు.
     
    చదువులో ప్రగతి, సక్రమంగా భోజన పథకం నిర్వహణపై దృష్టి
     
    ఎస్‌ఎంసీలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రగతిని పరిశీలించాల్సిందే. జిల్లా వ్యాప్తంగా సీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను ఆయా పాఠశాల సముదాయాల్లో గత వేసవిలో శిక్షణ ఇచ్చారు. ఇందులో సీ గ్రేడ్‌లో ఉన్నవారికి బీ గ్రేడ్‌కు బీ గ్రేడ్‌లో ఉన్న వారికి ఏ గ్రేడ్‌లోకి మార్చాలి. చాలా మంది ఇందులో వెనుకబడిపోయారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ అతి ప్రధాన బాధ్యత మధ్యాహ్నభోజన పథకం అమలు. జిల్లా వ్యాప్తంగా 3,310 పాఠశాలల్లో 3,44,354 మంది విద్యార్థులు చదువుతుండగా, ఇందులో మధ్యాహ్న భోజన పథకం కింద 3,29,620 మంది లబ్ధిపొందుతున్నారు. దీనికి  నెలకు సుమారు సుమారు రూ.7.2 కోట్లు ఖర్చవుతోంది. విద్యాశాఖ ఇచ్చిన మెనూ ప్రకారం ఆయా ఏజెన్సీలు నాణ్యమైన భోజనం విద్యార్థులకు వండి పెట్టాల్సిందే. కానీ వీటి అమలు ఎక్కడా సక్రమంగా జరగలేదు. అలాగే, గత ఏడాది మరుగుదొడ్ల నిర్వహణకు 2,570 మందిని నియమించగా, వారికి వేతనాల కింద రూ.1.24 కోట్లు చెల్లించారు. ఈ ఏడాది వేతనాలు లేక పోవడంతో  చాలా మంది చోట్ల మరుగుదొడ్ల నిర్వహణ మానేశారు.
     
    ఎస్‌ఎంసీలతో అభివృద్ధి
    పాఠశాల యాజమాన్య కమిటీలతో అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నాం. ఎన్నికైన సంఘాలు పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి. ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. అలాగే ఎస్‌ఎంసీలు భాగస్వామ్యంతోపాటు మా పర్యవేక్షణ ఉంటుంది.
       – ఎ.సుబ్బారావు, జిల్లా ఉప విద్యాశాఖధికారి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement