హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని నరసింహన్ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జె.వి. రాముడుతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో సైనిక కవాతు, ప్రభుత్వ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అలాగే హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరంచారు. ఏపీ శాసనమండలి ప్రాంగణంలో ఛైర్మన్ చక్రపాణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ శాసనమండలి సిబ్బంది హాజరయ్యారు.
వివిధ జిల్లాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల వివరాలు...
అనంతపురం జిల్లా:
అనంతపురం : నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలోని 163 మంది ప్రతిభావంతులకు కోన శశిధర్ మెమెంటోలు అందజేశారు. అలాగే గణతంత్ర వేడుకల్లో భాగంగా ఓపెన్ ఎయిర్ జైలు నుంచి 146 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు.
చిత్తూరు జిల్లా :
చిత్తూరు : చిత్తూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా:
గుంటూరు: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎస్పీ త్రిపాఠి, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ హాజరయ్యారు.
ప్రకాశం జిల్లా :
ఒంగోలు : ఒంగోలు పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పశ్చిమగోదావరి జిల్లా :
ఏలూరు : ఏలూరు పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర దినోత్సవవేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ కె. భాస్కర్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావుతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.